Andhra PradeshHome Page Slider

ఒళ్ళు మండితే పార్టీ మారతా: టీడీపి ఎంపీ కేశినేని నాని

Share with

ఏపీ లో వైఎస్ఆర్‌సీపీ‌తో చెట్టాపట్టాలు వేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం పై తరచూ వ్యాఖ్యలు చేస్తున్న ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని దూకుడు తెలుగుదేశం పార్టీలో అగ్ని రాజేస్తుంది. దేశం కోసం ఎవరితో అయినా కలుస్తానంటూ నాని తెలుగుదేశం పార్టీలో తుఫాను రేపుతున్నారు. ఇటీవల ఎంపీ కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీలో అలజడి రేపుతున్నారు. కొద్దిరోజుల క్రితం నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన రావుతో కలిసి వివిధ కార్యక్రమాల్లో కనిపించిన కేశినేని నాని ఆ తర్వాత తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి నాని అధిష్టానంతో పాటు పార్టీ నేతల పైన విరుచుకుపడ్డారు. విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టలదొరకు ఇచ్చిన అభ్యంతరం లేదని ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా గెలుస్తానేమో అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి సంచలన ప్రకటన చేశారు.తనకు ఒళ్ళు మండితే వేరే పార్టీలోకి పోతానంటూ తేల్చి చెప్పారు. తను అన్ని పార్టీలతో టచ్ లో ఉన్నానని బాంబు పేల్చారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో పలు గ్రామాలకు తాగునీటి సరఫరా ట్యాంకర్లను పంపిణీ చేసిన సందర్భంలో ఎంపి కేశినేని నాని ఈ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయని చెప్పుకొచ్చారు.

పార్లమెంట్ పరిధిలో ఎంపీ నిధులతో తాగునీటి సమస్యపై దృష్టి పెట్టామన్నారు. తెలుగుదేశం పార్టీలో తనకు ఏ పదవీ లేదని తానేమీ అధికార ప్రతినిధి పోలిట్ బ్యూరో సభ్యుడు కాదు అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తనను గొట్టం గాడని చెప్పుతో కొడతామని తిట్టిన వాళ్లు కూడా ఉన్నారని అయితే తాను ఏం మాట్లాడలేదని ప్రజల కోసం తాను తన పని చేసుకుంటూ వెళుతున్నానని చెప్పారు. అన్ని పార్టీలతో టచ్ లో ఉంటానని భారతీయ జనతా పార్టీ ,వైఎస్ఆర్‌సీపీ, కాంగ్రెస్ వామపక్షాలతో కూడా మాట్లాడుతూ ఉంటానన్నారు. కొంతమంది ఏం చేసినా మెచ్చుకునే వారు ఉంటారని అలాగే గిట్టని వారు ఉంటారని చెప్పారు. తాను పార్టీల తరఫున కార్యక్రమాలు చేయడం లేదని ప్రజల తరపున చేస్తున్నానని నాని అన్నారు. కొందరు పొమ్మన లేక పొగ పెడుతున్నారని తనకు ఆ హీట్ తగిలితే అప్పుడు పార్టీ మారే ఆలోచన చేస్తానని ప్రస్తుతం తాను తెలుగుదేశం పార్టీ సభ్యుడు మాత్రమేనని చెప్పారు. ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ అంశాలపై పార్టీ అధినేత చంద్రబాబు పిలిస్తే వెళ్లి మాట్లాడతానని కేశినేని నాని తెలిపారు