Andhra PradeshNews

వైసీపీపై వ్యతిరేకత… అందిపుచ్చుకోలేకపోతున్న టీడీపీ

Share with

◆ ప్రజలలో వైసీపీ మీద తగ్గిన ఆదరణ.. టీడీపీలో అయోమయం
◆ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కావాలంటున్న ఏపీ ప్రజలు
◆ మూడున్నర ఏళ్లుగా కేడర్‌ను పట్టించుకోని వైసీపీ పార్టీ
◆ ఏపీలో రాజకీయ అనిశ్చితి, ప్రజలు ఎటువైపు ?

ఏపీలో వింత రాజకీయ పరిస్థితి నెలకొంది. మూడున్నరేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ మీద ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ఆ పార్టీ విధి విధానాలపైనా జనంలో ఆగ్రహం ఎక్కువవుతోంది. అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నిస్తున్నవారి సంఖ్య అధికమవుతోంది. వైసీపీ అంటే బటన్ నొక్కే ప్రభుత్వంగా ముద్ర పడింది. ఓవైపు పథకాలు అందిస్తున్నా… ప్రభుత్వం మీద జనాలు కోపంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అసలు అందులో వాస్తవమెంత? ఏపీలో వైసీపీకి ధీటైన పార్టీగా ప్రతిపక్ష టీడీపీ ఉంది. కానీ వైసీపీకు ఆదరణ తగ్గితే ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉంటే ప్రజలు వైసీపీ నుండి ప్రధాన ప్రతిపక్షం వైపు చూడాలి, కానీ ఏపీలో చూస్తే ఆ రకమైన పొలిటికల్ సీన్ ఏమీ కనిపించడం లేదంటున్నారు ఎక్స్‌పర్ట్స్. వైసీపీ గ్రాఫ్ ఎంత తగ్గినా, టీడీపీ గ్రాఫ్ మాత్రం ఏం పెరగడంలేదంటున్నారు. మరి ఈ వ్యతిరేకత ఎటు పోతోంది. జనాలకు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉంది. అసలు ఏపీలో వైసీపీకి ధీటైన ప్రత్యర్థి పార్టీ ఉందా, లేదా ఏపీలో ఈ రకమైన పరిస్థితి రాజకీయ విశ్లేషకుల బుర్రలకు కూడా అందడంలేదు.

వైసీపీ పాలనలో అసలు అభివృద్ధి లేదన్న చర్చ కొన్నాళ్లుగా జోరందుకొంది. కనీసం వీధి దీపాలు వేయించే స్తోమత లేక సర్పంచ్‌లు డీలాపడ్డారు. ఖజానా నుంచి వచ్చే డబ్బులు కానీ అప్పుల ద్వారా పుట్టే సొమ్ములు కానీ అన్నీ కూడా కలగలిపి పథకాలకే పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. సంక్షేమం ఒక్కటి చాలు అభివృద్ధి అవసరం లేదన్నట్లుగా ఏపీలో వైసీపీ రాజకీయం సాగుతోంది. మరో వైపు చూస్తే వైసీపీ క్యాడర్‌ని కూడా హైకమాండ్ అసలు పట్టించుకోవడంలేదు. మూడున్నరేళ్లలో కేడర్‌కు పార్టీకి బాగా దూరం పెరిగింది. నాయకుల తీరు కూడా వేరుగా ఉంది. కార్యకర్తలకు వారికీ దూరం ఎక్కువయ్యింది. దాంతో సోషల్ మీడియాలో కూడా వైసీపీ క్యాడర్ పెద్దగా ఉత్సాహంగా కనిపించడంలేదు. ఇక టీడీపీ తీరు చూస్తే వైసీపీ వంద తప్పులు చేస్తే తమకు నచ్చినవి తమ దృష్టికి వచ్చినవి మచ్చుకు కొన్ని అన్నట్లుగా తీసుకుని వాటినే హైలెట్ చేస్తోంది తప్ప, వైసీపీపై పూర్తి స్థాయిలో పోరాటాలు చేయడం లేదన్న విమర్శ ఎదుర్కొంటోంది. వైసీపీపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ అందిపుచ్చుకోవటంలో విఫలం కావడం వల్ల… ఆ పార్టీ గ్రౌండ్ లెవల్లో బలపడలేదన్న ఇంప్రషన్ కలుగుతోందంటున్నారు నిపుణులు.

మీడియాలో సానుకూలత ఒక్కటే విజయానికి దోహదపడదని టీడీపీ పెద్దలకు ఇప్పటికే అర్థమైందంటున్నారు. మీడియా ఆధారంగా ప్రజలు ఓటేస్తే అసలు చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోవడం జరగదన్న అభిప్రాయం ఉంది. న్యూస్, అనాలసిస్ కార్యక్రమాలన్నింటినీ జనం టైమ్ పాస్ కోసం చూస్తున్నారని… వాటి ఆధారంగా ఒక అభిప్రాయానికి రావడం లేదన్న వర్షన్ తాజాగా బలంగా విన్పిస్తోంది. టీడీపీ నాయకగణం, జనాల్లో పోరాటం చేయాలని నాయకులు ఎంతసేపూ చంద్రబాబుపై ఆధారపడటమేగానీ… వీధుల్లోకి వచ్చి పోరాడిన సందర్భాలు లేనందువల్లే… టీడీపీ గ్రాఫ్ పెరగడంలేదంటున్నారు. వైసీపీ కూడా ప్రజలకు అనేక రకాల పథకాలు అందజేస్తోందని… వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకు తమ వైపే ఉంటుందని అంచనా వేసుకోవటం కూడా తప్పే అవుతుందంటున్నారు. కానీ 2024 ఎన్నికల నాటికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరని… ఎన్నీ పథకాలు అందిస్తున్నా కూడా ఓటర్లలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. రానున్న ఎన్నికల్లో మరిన్ని పథకాలతో టీడీపీ బరిలో దిగే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ఏపీలో ఈ రోజుకు మాత్రం ఏమీ తెలియని ఒక రాజకీయ అనిశ్చితి అయితే నెలకొని ఉంది. అది ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుందో వేచి చూడాల్సి ఉంది.