Andhra PradeshHome Page Slider

వైసీపీకి గుడ్ బై చెప్పిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

Share with

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారతారన్న ప్రచారం నడుమ ఇవాళ ఆయన తనయుడితో కలిసి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఒంగోలులో 33 ఏళ్లుగా మాగుంట బ్రాండ్‌తో రాజకీయాలు చేశామన్న ఆయన… తమకు అహం లేదన్నారు. కేవలం ఆత్మగౌరవం కోసమే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడాల్సి వస్తోందన్న ఆయన, ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడిని నిలపాలని నిర్ణయించానన్నారు. మాగుంటకు సీటు తిరిగి ఇచ్చేది లేదని సీఎం జగన్ చాన్నాళ్లుగా క్లారిటీ ఇచ్చినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మరోసారి ఎంపీ సీటు ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరినప్పటికీ ఆయన అందుకు ససేమిరా అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం విషయంలో మాగుంట తీరుపై సీఎం జగన్ అసహనంగా ఉన్నారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డి ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతుండగా… వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు.