NationalNews Alert

“సరోగసీ”తో కథానాయికల పాట్లు

Share with

ఇప్పుడు చిత్రపరిశ్రమలో ఎవరినోట విన్నా సరోగసీ మాటే. పిల్లల కోసం చాలామంది హీరోయిన్లు ఈవిధానాన్ని అవలంభిస్తున్నారు. మొన్నటికి మొన్న నయనతార పెళ్లయిన నాలుగు నెలలకే కవలపిల్లలు పుట్టారంటూ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. అంతకు ముందు శిల్పాశెట్టి, ప్రియాంక చోప్రా, అమీర్‌ఖాన్,కరణ్ జోహార్, ప్రీతిజిందాలపై కూడా ఈ విషయంలో వివాదం జరిగింది.

ప్రస్తుత స్పీడ్ ప్రపంచంలో పిల్లల్ని కనడానికి కూడా మనుషులకు టైం ఉండడం లేదు. దానితో సరోగసీ విధానం వెంటపడుతున్నారు చాలామంది సెలబ్రటీస్ తల్లిదండ్రులు. అసలు ఈ సరోగసీ ఏమిటి? ఎందుకు ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు? ఇది చట్టబద్దమేనా? భారత చట్టాలు దీనికి ఒప్పుకుంటున్నాయా?

సరోగసీ అంటే ఏమిటి?

సరోగసీ అంటే బిడ్డలను కనలేక వంధత్వంతో బాధపడుతున్న జంటలు, వారి జన్యువులతో మరొక స్త్రీ అంగీకారంతో ఆమె గర్భంలో వారి శిశువును పెంచి, ప్రసవానంతరం ఆ బిడ్డను ఆ దంపతులకు అప్పగించే విధానం. దీనిలో శిశువు దంపతుల బిడ్డగానే గుర్తింపబడతాడు. స్త్రీ కేవలం తన గర్భాన్ని అద్దెకిచ్చినట్లుగానే భావింపబడుతుంది.

ఎవరు అర్హులు ?

ఈ విధానానికి భారత చట్టం కొన్ని పరిమితులకు లోబడి అనుమతినిచ్చింది. అవేంటంటే దంపతులకు పెళ్లైన ఐదు సంవత్సరాలు వరకూ పిల్లలు లేకుండా ఉండాలి, వారికి 25 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వారికి బిడ్డను కనిలేని శారీరక లోపాలేవైనా ఉండాలి. వారికి అంతకు ముందే పిల్లలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే వారికి దీర్ఘకాలిక రోగాలు కానీ, ప్రాణాంతక వ్యాధి కానీ ఉంటే మరొక బిడ్డను ఈ సరోగసీ విధానంలో కనవచ్చు.

ఇక ఈ విధానంలో బిడ్డను నవమాసాలు మోయడానికి సిద్ధపడే మహిళకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆమె ఈ దంపతులకు దగ్గర బంధువై ఉండాలి. ఆర్థిక పరమైన లావాదేవీలతో ఈ గర్భానికి ఒప్పుకోకూడదు. తన జీవితంలో ఒక్కసారే ఈ సరోగసీ విధానానికి ఒప్పుకోవచ్చు. పూర్తి ఆరోగ్యంతో 25 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఈ విధానాన్ని పార్లమెంటులో చాలామంది సభ్యులు గతంలో వ్యతిరేఖించారు. సాధారణంగా పల్లెలలో, వెనుకబడిన ఆదివాసీ ప్రాంతాల మహిళలు డబ్బుపై ఆశతో ఈ విధానానికి సిద్ధపడే ప్రమాదం ఉందని, దీన్ని చట్టబద్ధం చేయరాదని విమర్శించారు. ఎన్నో వాద ప్రతివాదనల అనంతరం 2016లో ప్రవేశపెట్టబడిన ఈ బిల్లు 2021లో అనేక సవరణతో పాస్ చేయబడింది. పూర్తి నియమ నిబంధనలు పాటిస్తూ సరోగసీ విధానంలో బిడ్డలను పొందడానికి చట్టం అనుమతిస్తుంది.