News AlertTelangana

రాత్రి 10 తర్వాత పబ్ సౌండ్ రావొద్దు

Share with

హైదరాబాద్‌లోని పబ్‌లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్‌ల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇళ్ల మధ్య పబ్‌ల నిర్వహణపై జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అసోసియేషన్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. డీజే సౌండ్‌లు, అధిక ధ్వని, డ్యాన్స్ ల వల్ల చుట్టు పక్కల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని ,ఈ విషయంలో పోలీసులు, ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు దీనిపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. రాత్రి 10 దాటితే పబ్స్ లో ఎటువంటి సౌండ్ ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత పరిమితి వరకే అనుమతి ఇచ్చింది.

మూడు కమిషనరేట్‌ల పరిధిలో శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న పబ్బులు, బార్లపై ఎన్ని కేసులు నమోదు చేశారు? అసలు నివాస ప్రాంతాల్లో మొత్తం ఎన్ని పబ్బులు ఉన్నాయి? మ్యూజిక్‌ ప్లే చేయడానికి ఎన్నిపబ్‌లకు అనుమతి ఉంది? పబ్బులకు, బార్లులకు ట్రేడ్‌ లైసెన్స్‌ ఇవ్వడానికి జీహెచ్‌ఎంసీ ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది? అనే అంశాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రాత్రి 10 గంటల దాటిన తర్వాత శబ్ద కాలుష్యం చేసే పబ్‌లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. డీజేలు పెట్టడానికి ఆయా పబ్స్‌కు అనుమతులు ఉన్నాయా? ఇందుకు సంబంధించి ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారో వివరించాలని కోరింది. ఈ మేరకు మూడు కమిషనరేట్లకు, జీహెచ్‌ఎంసీకి, ఎక్సైజ్‌ శాఖకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 26 కు వాయిదా వేసింది.