InternationalNews

బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్.. సునాక్‌కు చేదు అనుభవం

Share with

UK విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ సోమవారం కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పోటీలో భారతీయ సంతతికి చెందిన మాజీ ఛాన్సలర్ రిషి సునాక్‌ను ఓడించి విజేతగా నిలిచారు. బోరిస్ జాన్సన్ వారసురాలిగా బ్రిటీష్ ప్రధాన మంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించేందుకు లిజ్ ట్రస్‌కు మార్గం సుగమమయ్యింది. టోరీ సభ్యులు వేసిన 1,60,000 ఆన్‌లైన్, పోస్టల్ ఓట్ల బ్యాలెట్‌ను లెక్కించి… లిజ్ ట్రస్ గెలిచినట్టుగా ప్రకటించారు. ప్రధాని రేసులో మొదట్నుంచి టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్న సునాక్, ట్రస్ చేతిలో ఓటమిపాలయ్యారు. మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత లిజ్ ట్రస్ బ్రిటన్‌ మూడో మహిళా ప్రధానికానున్నారు. విజేతను కన్జర్వేటివ్ పార్టీ శక్తివంతమైన 1922 బ్యాక్‌బెంచ్ ఎంపీల కమిటీ ప్రకటించింది. సునాక్ వాటా 60,399 ఓట్లతో పోలిస్తే ట్రస్ 81,326 ఓట్లను గెలుచుకోవడం విశేషం. ఎన్నికలపై అంచనా వేసిన రాజకీయ విశ్లేషకులు, మీడియా సంస్థలకు మొత్తం పరిణామం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎందుకంటే ట్రస్ ముందస్తు ఎన్నికల సర్వేలలో 42 ఏళ్ల సునాక్‌ను సునాయాశంగా ఓడిస్తారని అందరూ భావించారు. టోరీ సభ్యుల్లో బోరిస్ జాన్సన్‌పై ఉన్న విధేయత, సునాక్ ఆయనను మోసం చేశారన్న భావనతోపాటు… ప్రధానిగా బాధ్యతలు చేపడితే పన్నులను తగ్గిస్తానని ట్రస్ ప్రతిజ్ఞ చేయడం కూడా కారణమని ట్రస్ గెలుపునకు కారణమని చెప్పుకోవాలి. తాజా ఎన్నిక తర్వాత బ్రిటన్‌లో కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఉపఖండంలోని దేశాల నుంచి బ్రిటన్‌లో జీవిస్తున్న కన్జర్వేటివ్ పార్టీలోని పలువురు ఆసియన్లు తమకు అన్యాయం జరిగిందని ఫీలవుతున్నారు. సునాక్ ఛాన్సలర్‌గా ఉన్నప్పుడు పన్ను పెంపు ప్రణాళిక ముందుకు తీసుకురాగా… ట్రస్, ఆ వ్యవహారాన్ని పూర్తిగా తిప్పుకొట్టారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై పోరుపై దృష్టి సారించాలని, అత్యంత అవసరమైన వారికి మాత్రమే ప్రభుత్వ సాయాలు అందాలన్న సునాక్ తీరుకు తగిన ఆమోదం లభించలేదని తాజా ఫలితంతో రుజవవుతోంది.

బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే ట్రస్.. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. 96 ఏళ్ల బ్రిటన్ రాణి అనుమతి తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బోరిస్ జాన్సన్ కుంభకోణాల్లో కూరుకుపోవడంతో పదవి గత జులైలో రాజీనామా చేశారు. UK తదుపరి ప్రధానమంత్రిగా ఎంపికైనందుకు లిజ్ ట్రస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఆమె నాయకత్వంలో, భారతదేశం-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది మేలో భారత పర్యటనలో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగా ఉన్న ట్రస్… ఇండియా-యుకే మెరుగైన వాణిజ్య భాగస్వామ్యంపై సంతకాలు చేశారు.