Home Page SliderTelangana

విశ్వాసానికి మారుపేరు నరేంద్రమోదీ అయితే విశ్వాసఘాతకుడు కేసీఆర్…ఈటల

Share with

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌పై మండిపడ్డారు బీజేపీ నేత, చేరికల కమిటీ కార్యదర్శి ఈటల రాజేందర్. ప్రధాని మోదీ నిజామాబాద్ సభనుద్దేశించి చేసిన ప్రసంగానికి బీఆర్‌ఎస్ పార్టీ విపరీత అర్థాలు తీస్తోందంటూ విమర్శించారు ఈటల. నేడు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్, వారి తనయుడు కేటీఆర్ రాష్ట్ర గౌరవానికి తలవంపులు తెచ్చే అనుచిత పనులు చేస్తున్నారు. రోడ్లపై ప్రధానిని తెలంగాణకు రావద్దంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు అని మండిపడ్డారు. విశ్వాసానికి మారుపేరు నరేంద్రమోదీ అయితే విశ్వాసఘాతకుడు కేసీఆర్ అని ఈటల మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులు ప్రధాని మోదీ ఫొటోలను చించేసి, కుసంస్కారాన్ని ప్రదర్శించుకున్నారు. ఎప్పటినుండో మూడు రూపాయల కిలో చొప్పున కేంద్రమే బియ్యం ఇస్తోంది. కానీ ఎక్కడా రేషన్ షాపులలో మోదీగారి ఫొటో కనిపించకుండా చేస్తున్నారు. కేంద్రప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్‌ పథకంలో కూడా సిగ్గులేకుండా వారి ఫోటోలనే వేసుకుంటున్నారు. బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లొస్తాయంటూ విషప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రపంచంలోనే గొప్ప నాయకునిగా కీర్తించబడుతున్నారని, అలాంటి ఆయనను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గుర్తించకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.


కేసీఆర్‌ ఏ విషయానైనా తనకనుకూలంగా మార్చుకుంటారని, ఒకే వ్యక్తి గురించి, ఒకే సమస్య గురించి రకరకాలుగా మాట్లాడగల ఘనుడని ఎద్దేవా చేశారు. గత 10 నెలల కాలంలో కేసీఆర్ నైజం ప్రజలకు బాగా బోధపడిందని, కావాలంటే 2016లో మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభించినప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటలు వినండంటూ వీడియోని ప్రదర్శించారు. దేశానికి ఇలాంటి ప్రధాని దొరకడం ఎంతో అదృష్టమన్నారు. ఇలాంటి వ్యక్తి పాలనలో దేశం సుభిక్షంగా, సుస్థిరంగా ఉంటుందన్నారు. తెలంగాణ కోసం ఇలాంటి మహానుభావుడి ఆశీర్వాదం ఉంటే చాలు. మోదీజీ ఆశీర్వాదం ఉంటే చాలు తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 గా మారుతుందని ఆనాడు చెప్పారు. కానీ 2018లో కానీ జనరల్ ఎలక్షన్లలో నరేంద్రమోదీ చరిష్మా ముందు నిలవలేనని భయపడి ముందస్తు ఎలక్షన్లు పెట్టుకున్నాడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మోదీ పోరాడడం వల్లే కేసీఆర్ భయపడుతున్నాడన్నారు. ఈ విషయం ప్రజలు పసిగట్టారని, అందుకే జీహెచ్‌ఎంసీ, దుబ్బాక ఎలక్షన్లలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. అలాగే హుజారాబాద్ ఎలక్షన్లలో అనేక హామీలు ఇచ్చినా, దళిత బంధు ఇస్తానని ఆశపెట్టినా గెలవలేకపోయారన్నారు. ఇంత వరకు ఎంతమందికి దళిత బంధు 10 లక్షల చొప్పున వచ్చిందో నిజాయితీగా చెప్పగలరా? అంటూ సవాల్ చేశారు. గతంలో నిజాంలు కూడా ఇలా కుటుంబపాలన చేయలేదని, కానీ కేసీఆర్ మాత్రం కుటుంబపాలన చేస్తున్నారని పేర్కొన్నారు. నిధులన్నీ మీ కుటుంబాలకే మళ్లుతున్నాయి. ప్రజాస్వామ్యంలో రాచరికం చేస్తున్నారు. ఆరు నూరైనా బీఆర్‌ఎస్‌ను బరిగీసి కొడతాం అని, ప్రధాని తెలంగాణకు వచ్చి సవాల్ చేసి వెళ్లారు కాచుకోండి.. అంటూ హెచ్చరించారు.