Andhra PradeshHome Page Slider

గోబెల్స్ కాదు.. అంతకు మించి, నెల్లూరులో వేమిరెడ్డిపై ఆ ప్రచారం ఎందుకు!?

Share with

ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గత నెలలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు. వైసీపీలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులున్నాయన్న విషయం పక్కనబెడితే, ఆయన నెల్లూరు జిల్లాలో ఉన్న వైసీపీ అంతర్గత సమస్యలకు మరింత బలాన్నిచ్చేలా నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఆయన నెల్లూరు ఎంపీగా బరిలో దిగడంతోపాటుగా, ఆయన సతీమణి ప్రశాంతి సైతం కోవూరు ఎమ్మెల్యేగా బరిలో దిగడంతో, సహజంగా వైసీపీలో కాక రేగింది.

భార్యాభర్తలిద్దరూ అమీతుమీ సిద్ధమై పార్టీ మారారన్న అభిప్రాయం ఉంది. అయితే వేమిరెడ్డి పార్టీ మారబోతున్నారన్నట్టుగా గత నాలుగు రోజులుగా నెల్లూరులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ప్రతికూలత ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో, వేమిరెడ్డి టీడీపీలో చేరడం ఆ పార్టీకి జోష్ తీసుకొచ్చింది. అయితే ఇంతలా ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. ఓవైపు ఎల్లో మరోవైపు బ్లూ అంటూ రచ్చ సాగుతున్న తరుణంలో ఆయన టీడీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని తేల్చి చెప్పారు. తమ రాకతో చాలా మంది నేతలు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడాన్ని జీర్ణించుకోలేక ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక్కటి మాత్రం నిజం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పెద్దారెడ్డి పిలుపునకు నిఖార్సయిన నిదర్శనం. ఆయన పార్టీ మారారంటే అందుకు పెద్ద కారణమే ఉండి ఉండాలి. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో వైసీపీకి ఢిల్లీ వేదికగా ఎన్నో పనులు చేశారు. జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంగా పనిచేశారు. అదంతా గతం. కానీ వర్తమానం వేరు.

నాడు జగన్మోహన్ రెడ్డితోనే రాజకీయ సర్వశ్వం అని భావించిన వేమిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి నుంచి పక్కకు జరిగి పార్టీ మారడమన్నది చిన్న విషయం కాదు. ఆయన పార్టీ మారి, జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టేలా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడం కూడా ఆషామాషీయేం కాదు. అసలే పారిశ్రామికవేత్త, ఆపై జగన్మోహన్ రెడ్డిని కాదనుకోని బయటకు వచ్చినప్పుడు దేనికైనా సిద్ధమనే అనుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎవరెన్ని చెప్పినా ఆయన చివరి వరకు పోరాటం చేస్తూనే ఉంటారు. నెల్లూరులో తన స్టామినా ఏంటో రుజువు చేసుకునేందుకు అవకాశాన్ని వదులుకోరు.