Home Page SliderNational

“అమ్మ అన్నీ ఇస్తుంది”: సోనియాపైనే భారం మోపిన డీకే శివకుమార్

Share with

కర్నాటక ముఖ్యమంత్రి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య హోరాహోరీ సాగుతోంది. ఈ తరుణంలో తాను సీఎం పీఠం విషయంలో వెనక్కి తగ్గబోనని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పష్టం చేశారు. అయితే పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్నారు. తాను పార్టీకి వెన్నుపోటుపోడవబోనన్నారు. బ్లాక్‌మెయిల్‌ చేయనన్నారు. ఢిల్లీలోనే ఉన్న మరోనేత సిద్ధరామయ్య, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. కడుపులో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా గత రాత్రి తన పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్న శివకుమార్ ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. “పార్టీయే నా దేవుడు.. ఈ పార్టీని నిర్మించాం, నేను దానిలో ఒక భాగం. ఇందులో నేను ఒంటరిని కాదు,” అంటూ ఢిల్లీకి వచ్చే ముందు డీకే వ్యాఖ్యానించారు.

ఒక తల్లి తన బిడ్డకు ప్రతిదీ ఇస్తుందంటూ చెప్పుకొచ్చాడు డీకే శివకుమార్. పార్టీ తన పాత్రకు ప్రతిఫలమిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే తాను తిరుగుబాటు చేయనని పదే పదే చెప్పాడు. ‘‘పార్టీ కావాలంటే నాకే బాధ్యత ఇస్తుంది. మాది సమైక్య ఇల్లు, మా నంబర్ 135. ఇక్కడ ఎవరినీ విభజించడం ఇష్టం లేదు.. వాళ్లకు నచ్చినా నచ్చకపోయినా నేను బాధ్యతగల మనిషిని. వెన్నుపోటు పొడవను, బ్లాక్‌మెయిల్ చేయను’ అని శివకుమార్‌ స్పష్టం చేశారు. గత వారం జరిగిన ఎన్నికలలో, కర్నాటకలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని కైవసం చేసుకుంది, 224 సభ్యుల అసెంబ్లీలో 135 సీట్లు సాధించింది. సిద్ధరామయ్య, 75, మాజీ ముఖ్యమంత్రి, శివకుమార్, 61, పార్టీ కర్ణాటక చీఫ్. ముఖ్యమంత్రి పదవిపై వారి వారి వాదనలను, హైకమాండ్ పెద్దల ముందు బలంగా విన్పిస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని ఇరువురు నేతలు వాదిస్తున్నారు.

ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ గట్టి నిర్ణయం తీసుకోనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీలతో కూడిన పార్టీ నాయకత్వానికి నిన్న కొత్తగా ఎన్నికైన కర్నాటక ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకుల బృందం వివరించింది. ఆదివారం రహస్య ఓటింగ్ నిర్వహించిన పార్టీ, ఫలితాలను పార్టీ అధ్యక్షుడికి అందజేసింది. ఆయనే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రాబోయే 24 గంటల్లో కర్నాటక తదుపరి ముఖ్యమంత్రి పేరును పార్టీ ప్రకటించవచ్చని వర్గాలు తెలిపాయి. తాజాగా శివకుమార్‌ రంగంలోకి దిగడమే అతిపెద్ద సవాలు. కర్నాటక విజయం వెనుక ఎవరు ఉన్నారో నాయకత్వం గుర్తిస్తుందని భావిస్తున్నానని అన్నారు.