Home Page SliderNational

మనీష్‌పై పోలీసుల దురుసు ప్రవర్తన -మండిపడ్డ ఆప్

Share with

ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియాపై  పోలీసులు ప్రవర్తించిన తీరును ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా ఆప్ నేతలందరూ ఈ సంఘటనను ఖండిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్‌ను కస్టడీ ముగియడంతో నేడు కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో కోర్టు నుండి వస్తుండగా విలేకరులు ఆయన్ను చుట్టుముట్టి ప్రశ్నలవర్షం కురిపించారు. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలపై అధికారం రాష్ట్రప్రభుత్వానిదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రశ్నించారు. దీనికి సిసోదియా సమాధానం ఇస్తూ మోదీజీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని మోదీ అహంకారిగా మారారని పేర్కొన్నారు. ఈ సమయంలో విలేకరులను అదిలిస్తూ ఒక పోలీస్ అధికారి వారి ఫోన్లను లాక్కుంటూ, సిసోదియా మెడ చుట్టూ చేతులు వేసి బలవంతంగా మాట్లాడనీయకుండా తీసుకెళ్లారు. రౌస్ అవెన్యూ కోర్టులో సిసోదియాపై పోలీసుల జులుం అంటూ ఢిల్లీ మంత్రి అతిషి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు వ్యాఖ్యానిస్తూ నిందితులు మీడియాకు స్టేట్‌మెంట్లు ఇవ్వడం చట్టపరంగా వ్యతిరేకం అని, ఆయనకు మీడియా నుండి భద్రత కల్పించడానికే అలా చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సిసోదియాను జూన్ 1 వరకు కస్టడీలో ఉండాలని కోర్టు ఆదేశించింది.