NewsTelangana

కోమటిరెడ్డికి మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్

Share with

 తెలంగాణాలో మునుగోడు ఉపఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం నుంచి పలువురు బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్ధులతోపాటు, పలు నామినేషన్లు ఇవాళ దాఖలయ్యాయి. ఈ నామినేషన్లు భారీ ర్యాలీలతో చాలా అట్టహాసంగా జరిగాయి. మరోవైపు కొంతమంది అభ్యర్ధులు మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. దీంతో మునుగోడులో నామినేషన్ల సందడి నెలకొంది. ఈ మేరకు ఇవాళ బీజేపీ, టీఆర్‌ఎస్ అభ్యర్ధులు చుండూర్ తహసీల్దార్ కార్యాలయంలో తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఈ నామినేషన్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీకి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయారని ఆయన ఆరోపించారు. కోమటిరెడ్డి ఆ రూ.18 వేల కోట్ల రూపాయలను మునుగోడును అభివృద్ధి చేయడానికి ఇస్తే తాము ఉపఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటామని మంత్రి జగదీష్‌రెడ్డి  స్పష్టం చేశారు. దీని కోసం సీఎం కేసీఆర్‌ను ప్రాధేయపడి ఒప్పిస్తామని తెలిపారు. ఈ మునుగోడు ఉపఎన్నికలు రాజకీయ లబ్ధి కోసం మాత్రమేనని మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.