NationalNews

RSSపై మ‌మ‌త‌ పొగ‌డ్త‌లు….మండిప‌డ్డ బీజేపీ, విప‌క్షాలు

Share with

ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి , తృణ‌ముల్ కాంగ్రెస్ సుప్రిమో మ‌మ‌తా బెన‌ర్జీ RSS పై చేసిన కామెంట్స్ రాజ‌కీయంగా పెను దుమారాన్ని రేపాయి. ఇటీవ‌లే బీజేపీని టార్గెట్ చేస్తూ RSSపై మ‌మ‌త ప్ర‌శంస‌లు కురిపించారు. క‌మ‌ల‌ద‌ళంపై ఎప్పుడూ నిప్పులు చెరిగే మ‌మ‌తా, బీజేపీ మాతృసంస్థ RSS ను ప్ర‌శంసించ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. RSS అంత చెడ్డ‌ది కాదు, సంఘ్‌లో ఇప్ప‌టికీ కొంత మంది ఉన్నారు. వాళ్లు ఎప్ప‌టికీ బీజేపీలా ఆలోచించ‌రు. ఒక రోజు వారి స‌హ‌నం న‌శిస్తుంది. అంటూ మ‌మ‌తా ఇటీవ‌ల‌ వ్యాఖ్యానించారు. బీజేపీని ఇరుకున్న పెట్టాల‌న్న ఉద్దేశంతో RSSను పొగిడే ప్ర‌య‌త్నం చేశారు. అయితే మ‌మ‌తా వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు ఇత‌ర‌ విప‌క్షాల‌తో పాటు బీజేపీ ,ఆర్ ఎస్ ఎస్ సైతం తిప్పికొట్టాయి.


హైదరాబాద్ ఎంపీ , ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ మ‌మ‌త వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. దేశ ప్ర‌జ‌ల‌ను,బెంగాల్‌ ప్రజలను మ‌మ‌తా బెన‌ర్జీ త‌ప్పుదోవ‌ప‌ట్టిస్తున్నార‌ని ఆయ‌న‌ మండిప‌డ్డారు. గుజ‌రాత్ న‌ర‌మేధం త‌ర్వాత పార్ల‌మెంట్‌లో నాడు బీజేపీ ప్ర‌భుత్వాన్ని కాపాడేందుకు మ‌మ‌త ప్ర‌యత్నించార‌ని ఆయ‌న ఆరోపించారు. 2003లో మమతా బెనర్జీ, RSS నేతలు పరస్పరం పొగడ్తలు కురిపించుకున్నారని అసద్‌ చెప్పారు. నాడు ప్రచారక్‌లను దేశ‌భ‌క్తుల‌ని మమత కొనియాడ‌ర‌ని, మ‌మ‌త‌ను దుర్గామాత‌గా RSS కీర్తించింద‌ని ఓవైసీ చెప్పారు. దీనిపై తృణ‌మూల్ ఘాటుగా స్పందించింది. తమ సెక్యుల‌రిజాన్ని ఓవైసీ ముందు నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌న్నారు తృణ‌మూల్ నేత‌లు. అన్ని సంస్థ‌ల్లో మంచి వ్య‌క్తులు- చెడ్డ‌వారు ఉంటారన్న‌దే మ‌మ‌తా ఉద్దేశ‌మ‌ని అందులో త‌ప్పుబ‌ట్టాల్సింది ఏముంద‌ని తృణ‌మూల్ ఎంపీ సౌగ‌త్ రాయ్ ప్ర‌శ్నించారు.


కాంగ్రెస్ పార్టీ సైతం మ‌మ‌తపై విమ‌ర్శ‌లు గుప్పించింది. ఆర్ ఎస్ ఎస్‌ను మ‌మ‌త ప్ర‌శంసించ‌డం ఇదే తొలిసారి కాద‌ని కాంగ్రెస్ ఎంపీ అధీరంజ‌న్ చౌద‌రి చెప్పారు.అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు మ‌మ‌తా NDAతో జ‌ట్టుక‌ట్టార‌ని ఆయ‌న అన్నారు. అప్ప‌ట్లో ఆర్ ఎస్ ఎస్ పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌కు మ‌మ‌త హాజ‌ర‌య్యార‌ని, లెఫ్ట్ స‌ర్కార్‌ను కూల్చేందుకు వారి మ‌ద్ద‌తును మ‌మ‌తా కోరార‌ని ఆధీరంజ‌న్ చౌద‌రి చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల్లో ల‌బ్ది కోసం అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా ఆయా వ‌ర్గాల‌కు అనుకూలంగా ఆమె మాట్లాడ‌తార‌ని అధీరంజ‌న్ ఎద్దేవ చేశారు. ఓసారి హిందూత్వ‌వాదులను..మ‌రోసారి ముస్లీంల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆమె ప్ర‌య‌త్నిస్తార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.
కమ్యూనిస్ట్ నేత‌లు సైతం మ‌మ‌త‌ వ్యాఖ్య‌లపై ఘాటుగా స్పందించారు. బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాటం చేసే పార్టీ తృణ‌మూల్ కాద‌న్న విష‌యం మ‌రోసారి స్ప‌ష్ట‌మైంద‌ని సీపీఎం కేంద్ర క‌మిటీ స‌భ్యుడు సృజ‌న్ చౌద‌రి వ్యాఖ్యానించారు. మ‌మ‌తా బెన‌ర్జీని కూడా ఆర్ ఎస్ ఎస్సే త‌యారు చేసింది.. ఈ విష‌యం మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

మ‌రోవైపు మ‌మ‌త ప్రశంస‌ల‌ను ఆర్ ఎస్ ఎస్ పెద్దగా ప‌ట్టించుకోలేదు. ముందు ప‌శ్చిమ‌బెంగాల్లో రాజ‌కీయ హింస‌ను నివారించ‌డంపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టాల‌ని హిత‌వు ప‌లికారు ఆర్ ఎస్ ఎస్ నేత‌లు. రాజ‌కీయ విభేదాలుండొచ్చు..కానీ ప్రత్యర్థి పార్టీల వాళ్లను   హ‌త‌మార్చాల‌నుకోవ‌డం   స‌రైన ప‌ద్దతి  కాద‌ని ప‌శ్చిమ బెంగాల్ ఆర్ ఎస్ ఎస్ ప్రధాన  కార్యద‌ర్శి జిష్ణుబ‌సు వ్యాఖ్యానించారు. బెంగాల్లో  ఎన్నిక‌ల‌కు ముందు చెల‌రేగిన హింస 60మందిని బ‌లితీసుకుంద‌ని ఆయ‌న చెప్పారు.రాష్ట్రంలో శాంతిభ‌ద్రత‌లు కాపాడే దిశ‌గా మ‌మ‌త ప‌నిచేయాల‌ని  ఆయ‌న‌ సూచించారు. మ‌మ‌త ఇచ్చే  స‌ర్టిఫికెట్‌తో త‌మ‌కు ప‌నిలేద‌న్నారు.కమలం కూడా అదేరీతిన స్పందించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దీలీప్ ఘోష్ మ‌మ‌త బెన‌ర్జీ నుంచి స‌ర్టిఫికెట్‌లు త‌మ‌కు  అవ‌స‌రం లేద‌న్నారు. తాము స‌రైన‌వాళ్లమో కాదో  నిర్ణయించాల్సింది ప్రజలేన‌ని బీజేపీ నేత‌లు చెప్పారు.