NewsTelangana

డబ్బులా..! మంచి నీళ్లా..!

Share with

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నామినేషన్లకు తుది గడువు ఇక రెండు రోజులే ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ నామినేషన్‌ పత్రాలు సమర్పించి.. స్థానిక నాయకులను, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ల మాట ఎలాగున్నా.. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మాత్రం ఒకరికి మించి మరొకరు ఖర్చు చేస్తూ ఓట్లను కొనే పనిలో మునిగిపోయారు. ఎవరూ ఊహించని కొత్త కొత్త స్కీములు అమలు చేస్తూ డబ్బులను విచ్ఛలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఒకరు మందు, విందు పార్టీ ఇస్తే.. మరొకరు చికెన్‌.. ఇంకొకరు గోవా ట్రిప్పులు.. మరొకరు తులం బంగారం.. పే టీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, కంట్రాక్ట్‌ పే.. ఇలా డబ్బుల చుట్టే మునుగోడు ప్రచారం సాగుతోంది.

మందు పార్టీ.. కాంట్రాక్ట్‌ పే..

దసరా పండుగ సందర్భంగా ఒక పార్టీ నాయకులు కిలో చికెన్‌, మందు బాటిళ్లు పంచారని స్థానికులు చెప్పుకున్నారు. మంత్రి మల్లారెడ్డి ప్రచారం తర్వాత తన అనుచరులకు ఏకంగా మందు పోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. పైగా.. ప్రచారం తర్వాత తన బంధువుల ఇంట్లో మందు పార్టీ చేసుకున్నామని.. భోజనానికి ముందు మందు తాగడం తెలంగాణాలో రివాజు అని.. అసలు మందు తాగితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ కోసమే పార్టీ మారారని.. ఉప ఎన్నికను సృష్టించి రూ.500 కోట్ల బోనస్‌ రివార్డు కూడా గెలుచుకున్నారని నియోజకవర్గంలో ‘కాంట్రాక్ట్‌ పే’ అంటూ రాత్రికి రాత్రి పోస్టర్లు వెలిశాయి.

నాయకులకు లక్షల్లోనే..

పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు నాయకులకు, కార్యకర్తలకు వారి స్థాయిని బట్టి లక్షల్లోనే ముట్ట చెప్తున్నట్లు వార్తలొస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇటీవల ఒక ఎంపీటీసీ పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు ఓ పార్టీ రూ.5 లక్షలు ఇచ్చింది. మరో పార్టీ తమ పార్టీలో చేరాలంటూ రూ.10 లక్షలు ఇచ్చింది. ఆ డబ్బు తీసుకొని ఆ నాయకుడు కాస్తా పార్టీ ఫిరాయించాడు. ఆయన బేరం అక్కడితో ఆగిపోలేదు. తమ పార్టీలోకి రావాలంటూ మూడో పార్టీ రూ.20 లక్షల ఆఫర్‌ ఇచ్చింది. ఓ గ్రామ సర్పంచ్‌కు ఓ పార్టీ ఏకంగా రూ.30 లక్షలు ఇచ్చింది. దీంతో ఆయన కండువా మార్చేశారు.

ఓటర్లకు రూ.30 వేలు.. తులం బంగారం..

ఓటర్లకు తొలి విడతలోనే ఒక వెయ్యి నుంచి 10 వేల రూపాయల వరకు పంచినట్లు సమాచారం. పోలింగ్‌కు ముందు మరో విడత పంపకం ఉంటుందంటున్నారు. మొత్తంగా ఒక్కో ఓటరుకు ఎన్నికలయ్యే నాటికి రూ.30 వేల వరకు ముట్టజెప్పేందుకు ఒక పార్టీ ప్లాన్‌ చేస్తోందని ఆరోపణలొస్తున్నాయి. ఇక నియోజక వర్గం బయట ఉన్న వారికి ఓటరుకు ఒక పార్టీ రూ.40 వేలు చొప్పున ఆఫర్‌ చేసినట్లు చెప్పుకుంటున్నారు. మరో పార్టీ వారు ఓటరుకు తులం బంగారం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ తదితర నగరాల్లో నివసిస్తున్న మునుగోడు ప్రజలను ఓటింగ్‌ రోజు తీసుకొచ్చేందుకు ప్రత్యేక వాహనాలు కూడా సిద్ధం చేస్తున్నారు.

డిజిటల్‌ పే.. గోవా ట్రిప్‌..

గూగుల్‌ పే చేయాలా.. ఫోన్‌ పే చేయాలా.. అని ఓటర్లను బూత్‌ స్థాయి ఇంచార్జిలు అడిగి మరీ డిజిటల్‌ చెల్లింపుల కోసం వారి ఫోన్‌ నెంబర్లు సేకరిస్తున్నారు. అంతేకాదు.. పది మంది యువకులు కలిసి తమ పార్టీకి ప్రచారం చేస్తే గోవా ట్రిప్‌కు పంపిస్తామంటూ చౌటుప్పల్‌ మండలంలో విమాన టికెట్లు సైతం బుక్‌ చేసేశారు. చేతి ఖర్చులకు రూ.10 వేలు కూడా ఇస్తామంటున్నారు. ఇప్పటికే రెండు యువజన సంఘాలకు గోవా టికెట్లు కూడా బుక్‌ అయిపోయాయని చెబుతున్నారు. ఇక రోజూ ప్రచారంలో పాల్గొనే గల్లీ నాయకులకు, కార్యకర్తలకు అయితే ఈ నెల రోజులూ పండగే. ప్రచారం అయిపోగానే రోజూ వెయ్యి రూపాయలు ఇవ్వడంతో పాటు చికెన్‌ బిర్యానీ, ఓ మందు బాటిల్‌ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు.

కాస్ట్‌లీ బై ఎలక్షన్‌..

మొత్తానికి.. మునుగోడులో ప్రలోభాల పర్వం పీక్‌ స్టేజ్‌కు చేరుకుందని.. ఈ ఎన్నికలు దేశంలోనే ‘కాస్ట్‌లీ బై ఎలక్షన్‌’గా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ఎన్నికల ఖర్చును మునుగోడుకు ముందు.. మునుగోడు తర్వాత అన్నట్లుగా మార్చేస్తున్నారని వాపోతున్నారు. ‘డబ్బులు, బంగారం ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తేనే వస్తాయి’ అంటూ లలిత జ్యువెల్లరీ ప్రకటనలోని మాటలను మార్చి వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అవి డబ్బులా.. మంచి నీళ్లా.. అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.