Home Page SliderNational

కేసీఆర్, మమత, నితీష్‌తో కలిసి పనిచేస్తామన్న మొయిలీ

Share with

2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఎలా ముందడుగు వేయాలన్నదానిపై కాంగ్రెస్ పార్టీ గందరగోళానికి గురవుతోంది. మమతా బెనర్జీ, నితీష్ కుమార్, కేసీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల పెద్దలతో కలిసి పనిచేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్‌పర్సన్ వీరప్ప మొయిలీ. మేఘాలయ ఎన్నికల ప్రచారంలో టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీపై, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే మొయిలీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే అందులో మమత బెనర్జీ కీలకమన్నారు మొయిలీ.

మమత బెనర్జీ, నితీష్‌ కుమార్‌, కె చంద్రశేఖర్‌రావుతో కలిసి సమస్యలను పరిష్కరించుకుని కలిసి పని చేస్తామన్నారు. కూటమికి నాయకత్వం వహించడంతోపాటు, కలిసికట్టుగా పనిచేసి అందరం కలిసిలా చేస్తామన్నారు వీరప్ప మొయిలీ. కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని.. పార్టీ బలంగా ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతామన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ మూడు రోజుల మెగా మేధోమథన సభ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. అంతకు రెండు రోజుల ముందు రాహుల్, తృణముల్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మేఘాలయలో బీజేపీని గెలిపించడం కోసం మమత పార్టీ పనిచేస్తోందన్నారు. గోవాలో భారీగా డబ్బు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలవాలనుకున్నారన్నారు. మేఘాలయలోనూ టీఎంసీ అదే పనిచేస్తోందన్నారు. బెంగాల్‌లో హింస, కుంభకోణాలు, డబ్బుతో టీఎంసీ రాజకీయం చేస్తోందన్నారు. మేఘాలయలో బీజేపీని బలోపేతం చేసి అధికారంలోకి తేవడమే టీఎంసీ ఆలోచనంటూ రాహుల్ దుయ్యబట్టారు.

2024లో బీజేపీని సవాలు చేసే బీజేపీయేతర పార్టీలతో చర్చలు జరుపుతామని మొయిలీ ప్రకటనపైనా గందరగోళం కన్పిస్తోంది. ఓవైపు రాహుల్ గాంధీ, అంతకు ముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రకటనకు అందుకు విరుద్ధంగా కన్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి “రాహుల్ గాంధీ ఒక ఆస్తి. నేను 60 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నాను. మాకు బలాలు, బలహీనతలు తెలుసు. మేము కలిసి పని చేస్తాం,” అని రాహుల్ గాంధీ ప్రకటన విషయం గురించి అడగ్గా, మొయిలీ వివరణ ఇచ్చారు. ఐతే రాహుల్ వ్యాఖ్యలపై మమత బెనర్జీ అల్లుడు విరుచుకుపడ్డాడు. దేశ వ్యాప్తంగా బీజేపీని ప్రతిఘటించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని… పార్టీ అసమర్థత, అభద్రతా భావంతో మతిభ్రమించిందన్నారు. టీఎంసీపై దాడి చేసే బదులు, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవాలని ఆయన రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. టీఎంసీ ఎదుగుదల డబ్బుతో కాదని, ప్రజల ప్రేమతో అని అభిషేక్ బెనర్జీ ట్వీట్ చేశారు.