Home Page SliderTelangana

‘ఎంపీగా గెలిచి చూపిద్దాం’… ఈటల రాజేందర్

Share with

 ‘రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుదాం. ఎంపీగా గెలిచి చూపిద్దాం. కుట్రలు, కుతంత్రాలను ఎదిరిద్దాం. ఎవ్వరు ఏ సమస్యతో వచ్చినా మనకు చేయగలిగిన సాయం చేద్దాం’ అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈటల రాజేందర్. కమలాపురం మండలంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఈటల. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలతో అసెంబ్లీ ఎన్నికలలో గెలుపోటములపై చర్చించారు…’ఈ నియోజక వర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగినా అది మన హయాంలో జరిగిందే. ఈ నియోజక వర్గంపై పగబట్టారు గత ముఖ్యమంత్రి కేసీఆర్. గత ఎమ్మెల్యే ఎన్నికలలో ఓడిపోయిన వ్యక్తికి అధికారమిచ్చి మనపై కక్ష తీర్చుకుంటున్నారు. ఈటలకు ఎలాంటి పేరూ రాకూడదని నిర్ణయించుకున్నారు కేసీఆర్. కేసీఆర్‌ను ఓడగొట్టే దమ్ము ఉన్న ఈటలను ఈ నియోజక వర్గంలో లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే కేసీఆర్ ఉన్నారు. బీజేపీలో చేరిన తర్వాత, కేవలం హుజూరాబాద్‌లోనే కాదు, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకుని జరిగిన ఎన్నికలలో ప్రచార కర్తగా ఉన్నాం. పార్టీ గుర్తించి, గౌరవించి ఇచ్చిన బాధ్యతను నిర్వహించాను. నా పనితనం ఇక్కడ కొత్త కాదని ఇక్కడి ప్రజలు అర్థం చేసుకుంటారనుకున్నాను’.

‘ఈ నియోజక వర్గానికి మంచి చేస్తానని ఇచ్చిన హామీలను 2021 ఎన్నికలలో నేను గెలవగానే కేసీఆర్ రద్దు చేశారు. గత 40 ఏళ్లలో హుజూరాబాద్‌కు ఎవ్వరూ చెయ్యని అభివృద్ధిని ఐదేళ్లలో  చేసి చూపించాను. కేవలం ఈ నియోజక వర్గంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ నుండి ఎవ్వరు వచ్చి మన సాయం అడిగినా చేసి చూపించాను. నాకు ఎలాంటి గ్రూపులు, కులం, మతం లేదు. నేను ఎవ్వరిపై  ఎలాంటి అనవసరపు కామెంట్లు చేయను అని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ఓటు వేయకుంటే దళిత బంధు, కళ్యాణ లక్ష్మి పథకాలు తీసేస్తారని బెదిరించి ఓట్లు వేయించుకున్నారు. సోషల్ మీడియాలో  చిల్లరగాళ్లు పెట్టే కామెంట్లకు మనం స్పందించాల్సిన అవసరం లేదు. ముఖ్యనాయకులతో చర్చించి, పార్లమెంటు ఎన్నికలలో ప్రణాళికలతో ముందడుగు వేద్దాం. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కూడా న్యాయమైన వారిని రూపాయి ఖర్చు కాకుండా గెలిపించాను. బీజేపీ కార్యకర్తలందరూ ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండండి. స్థానిక సంస్థల ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల వరకూ మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మన కార్యకర్తలు సరిగ్గా పనిచేయలేదని ఎవ్వరూ అనకూడదు’ అని హితబోధ చేశారు. పార్టీ ఆదేశిస్తే ఎంపీ ఎన్నికలలో పోటీ చేసి, సత్తా చూపిద్దామని ప్రజలలో విశ్వాసం నింపుదామని కార్యకర్తలను ఉత్తేజపరిచారు.