Home Page SliderTelangana

సిరిసిల్లలో కేటీఆర్‌ సరికొత్త రికార్డు!?

Share with


కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గం చేనేత వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులుంటారు. అయితే చేనేతలో ఉపాధి కరువవడంతో చాలా మంది షోలాపూర్, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. మరికొందరు బీడీ పరిశ్రమకు మారారు. దీంతో చేనేత పరిశ్రమ ప్రమాదంలో పడింది. అయితే తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేనేతల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామంటోంది. బతుకమ్మ చీరలతో మరమగ్గాలకు ఆర్డర్లు ఇచ్చామంటోంది సర్కార్. స్వయంగా సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఈసారి ఆయనను ఓడించి తీరుతానంటున్నారు కేకే మహేందర్ రెడ్డి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో నాలుగుసార్లు ఓటమి పాలైనప్పటికీ ఆయన మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్ట్ రాణి రుద్రమదేవి పోటీ చేస్తోండటం, ఆమె ఏమేరకు ప్రభావం చూపుతారన్నది చూడాల్సి ఉంది. బీజేపీలో ఉన్న పద్మశాలీ నాయకులు చివరి నిమిషంలో ఆమెకు టికెట్ కేటాయించడంతో బీఆర్ఎస్ గూటికి చేరిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ గెలుపు నల్లేరుపై నడకేనా లేదంటే కేకే మహేందర్ రెడ్డి ఝలక్ ఇస్తారో చూడాల్సి ఉంది.

సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలింగ్ బూత్‌లు 287 ఉండగా, పురుష ఓటర్లు 1,17,872 మంది కాగా, స్త్రీ ఓటర్లు 1,22,920, ట్రాన్స్ జెండర్లు ఆరుగురు ఓటు నమోదు చేసుకున్నారు. ఇక మొత్తం ఓటర్లు 2,40,798 మంది ఉన్నారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పద్మశాలీ ఓటర్లు 21 శాతానికి చేరువలో ఉన్నారు. ఇక ఇతర బీసీ ఓటర్లు సైతం 12 నుంచి 13 శాతం మేర ఉండగా మాదిగలు 9 శాతానికి చేరువగా ఉన్నారు. తెనుగు-ముదిరాజ్ ఓటర్లు సైతం 8 శాతానికి కొంచెం అటూ ఇటూగా ఉన్నారు. మాల ఓటర్లు ఏడున్నర శాతం, గొల్ల-కురమ ఓటర్లు 7 శాతం, రెడ్డి ఓటర్లు 6 శాతానికి పైగా ఉండగా, గౌడలు కూడా అదే సంఖ్యలో ఉన్నారు. మున్నూరుకాపులు ఇక్కడ సుమారుగా 6 శాతానికి చేరువగా ఉన్నారు. లంబాడ ఓటర్లు సైతం ఇక్కడ మూడున్నర శాతం ఉన్నారు. ఇతర అన్ని కులాల ఓటర్లు 14 నుంచి 15 శాతం ఉన్నారు.