Andhra PradeshHome Page Slider

గణతంత్రదినోత్సవానికి “కోనసీమ ప్రభలు”

Share with

కోనసీమలో కనువిందుగా కనుమ రోజున జరిగే ప్రభల తీర్థానికి జాతీయస్థాయిలో ప్రత్యేకత దక్కబోతోంది. ఈ ఏడాది జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ తరపున శకటం ప్రదర్శించబడుతోంది. సంక్రాంతి పండుగ ఇతివృత్తంగా కోనసీమ ప్రభల తీర్థం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శకటం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

మొసళ్లపల్లిలో జగ్గన్నతోట ప్రభల తీర్థం అంటే కోనసీమలో తెలియని వారుండరు. ఈ తీర్థం 17 వశతాబ్ధం నుండి కొనసాగుతోంది. మకర సంక్రమణం జరిగిన తర్వాత అనగా కనుమ నాడు ఈ జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమం అతి పవిత్రమైన సంగమం.

పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో 11 గ్రామాలకు చెందిన ఏకాదశ రుద్రులు సమావేశమయ్యారని నమ్మిక. ఇక్కడ మనకు మామూలు రోజులలో ఏ రకమైన గుడులు, గోపురాలు కనిపించవు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వేదసీమ అయిన కోనసీమలోనే ఈ సమాగమం జరుగుతుందని నమ్ముతారు. ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా ఈ ఏకాదశరుద్రులను ఈ తోటలో చేర్చుతారు గ్రామస్తులు.

శ్రీ రాజా వత్సవాయి జగన్నాధమహారాజుగారి ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో పిలువబడుతుంది. ఈ రుద్రులకు అధ్యక్షుడు వ్యాఘ్రేశ్వరానికి చెందిన శ్రీ వ్యాఘ్రేశ్వరుడు. మొసలపల్లికి చెందిన మధుమానంత భోగేశ్వరుడు మిగిలిన గ్రామ రుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. ఈ ప్రభల నిర్మాణానికి వెదురుకర్రలను అందంగా వంచి.. కొబ్బరితాడుతో ఆ వెదురుబొంగులను కలుపుతారు. రంగురంగుల వస్త్రంతో ప్రభను అందంగా అలంకరిస్తారు. శివయ్యను ఏర్పాటు చేస్తారు. ఈ పనులన్నీ చాలా నియమనిష్ఠలతో ఆచరిస్తారు ఆ గ్రామస్తులు.

సంక్రాంతికి 10 రోజుల ముందు నుండి ప్రభల తయారీని మొదలు పెడతారు. హరహర అని పరమేశ్వరుడిని తలచుకుంటూ మేళతాళాలతో ప్రభలను జగ్గన్న తోటలోకి తీసుకువస్తారు. ఈసారి ఢిల్లీలో కూడా రిపబ్లిక్ వేడుకలలో మనం ఈ ప్రభల తీర్థాన్ని చూడవచ్చు.