Home Page SliderTelangana

9 ఏళ్ల అసమర్థ పాలనలో వైఫల్యాలపై కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ

Share with

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి.. 9 ఏళ్లుగా రాష్ట్రంలో అసమర్థ పాలన కారణంగా ప్రజలకు జరుగుతున్న నష్టాలు, సర్కారు హామీలు ఇచ్చి ప్రజలను మోసంచేసిన అంశాలను ప్రస్తావిస్తూ.. మిగిలున్న 4 నెలల్లో అయినా.. హామీలను పూర్తిచేయాలని కోరుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. 2014, 2018 ఎన్నికల ప్రచారం సందర్భంలో, ఎన్నికల ప్రణాళికల్లో, వివిధ జిల్లాల్లో పర్యటనలప్పుడు, అసెంబ్లీ సమావేశాల్లోనూ మీరు అనేక సార్లు అనేక హామీలు ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా ఆ హామీలకు అతీగతీలేదు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు వాటిని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా..అంటూ లేఖ రాశారు.

లక్ష రూపాయల రుణమాఫీ

ఏకమొత్తంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామంటూ రైతులకు పెద్దఎత్తున ఆశలు కల్పించి వారితో ఓట్లు వేయించుకున్నారు. రుణం మాఫీ అవుతుందన్న ఆశతో రైతులు వడ్డీలు కట్టలేదు. వడ్డీలు పేరుకుపోయి అసలును మించిపోయింది. వడ్డీలు కడదామనుకున్న కట్టలేని పరిస్థితి ఏర్పడింది.మీ హామీ రైతులకు మేలు చేయకపోవగా, కీడే ఎక్కువ చేసింది. యుద్ధప్రాతిపదికన ఏకమొత్తం లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను

గిరిజనులకు పోడు భూములకు పట్టాలు

తెలంగాణలో అడవిని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులు వ్యవసాయం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న అర్హులైన గిరిజనులను గుర్తించి, తక్షణమే వారికి ఆ భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తున్నాను.

నిరుద్యోగ సమస్య

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష వెనక నిరుద్యోగ సమస్య ఒక ప్రధాన కారణం. అయినప్పటికీ మీరు నియామకాలు చేపట్టకపోగా, కనీసం నిరుద్యోగ భృతి హామీని సైతం నెరవేర్చలేదు. 2018 ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.3016 భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే నిరుద్యోగులకు నెలకు రూ.3016 భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.

డబల్ బెడ్ రూమ్ ఇండ్లు

అర్హులైన పేదలందరికీ ప్రభుత్వమే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తుందని 2014 ఎన్నికల నుంచి అనేకసార్లు హామీ ఇచ్చారు. 9 ఏళ్లుగా వారి ఆశలు అడియాసలవుతూనే ఉన్నాయి. 2018 ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపనలు కూడా చేశారు. మీరు హామీ ఇచ్చిన విధంగా తక్షణమే రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందివ్వాలి.

పెన్షన్లు, రేషన్ కార్డుల జారీ

పెన్షన్ కోసం, కొత్త రేషన్ కార్డు కోసం అర్హతలున్న వారు ఎంతో మంది ఏళ్లుగా నిరీక్షిస్తున్నా వారికి మాత్రం మంజూరు కావడం లేదు. తక్షణమే కొత్తగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను.

దళితబంధు’

రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలతో పోలిస్తే, మీరిచ్చింది ఏమాత్రం లెక్కలోకి లేదు.అధికార పార్టీ ఎమ్మెల్యేలే 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని మీరే స్వయంగా చెప్పారు. అర్హతలున్న ప్రతి దళిత కుటుంబానికి తక్షణమే ‘దళితబంధు’ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.

కులవృత్తుల వారికి రూ.1 లక్ష సాయం

ఈ పథకానికి పెద్దగా సమయం ఇవ్వకుండానే దరఖాస్తు చేసేందుకు గడువు విధించారు. ఫలితంగా అర్హతలున్నప్పటికీ అవసరమైన పత్రాలు లేని కారణంగా ఎంతో మంది బీసీలు దరఖాస్తు చేయలేకపోయారు. ఈ పథకానికి అర్హులందరినీ గుర్తించి, వారికి కూడా ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను.

NRI పాలసీ

తెలంగాణలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఎంతో మంది యువత సొంత ఊరు, ఇల్లు, కుటుంబాన్ని వదిలి జీవనాధారం కోసం గల్ఫ్ లో పని చేస్తున్నారు. ఇలా గల్ఫ్ బాట పట్టిన వారు లక్షల్లోనే ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్ కు వెళ్లినవారు చాలామందే ఉన్నారు. మీరు చెప్పిన ప్రకారం తక్షణమే NRI పాలసీ తీసుకొచ్చి, రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి, సెక్రటేరియట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.