Home Page SliderTelangana

వర్షాలపై కీలక అప్‌డేట్: వాతావరణ శాఖ

Share with

తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. అలాగే గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ఈ నెల 24 వరకు పలుచోట్ల మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షపాతం రికార్డయ్యింది.