NewsTelangana

కేసీఆర్‌.. నా ముఖం చూడొద్దనుకుంటున్నారా..?

Share with

‘సీఎం కేసీఆర్‌ నా ముఖం చూడొద్దనుకుంటే బహిరంగంగా చెప్పాలి. దమ్ముంటే అందరి ముందు ప్రకటించాలి. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందాం’ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చాలెంజ్‌ చేశారు. ‘నీ దగ్గరకు వచ్చి పోటీ చేస్తానని ఇప్పటికే చాలెంజ్‌ చేసిన. బెదిరింపులకు భయపడను. చావుకైనా సిద్ధం. రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో 20 ఏళ్లుగా ఏ పాత్ర పోషించానో.. ఇప్పుడూ అదే పాత్ర పోషిస్తా’ అని స్పష్టం చేశారు. స్పీకర్‌ను ‘మర మనిషి’ అని అన్నందుకు ఈటలపై సస్పెన్షన్‌ వేటు వేస్తారని వార్తలొస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే కేసీఆర్‌కు ఇలా సవాల్‌ విసిరారు.

స్పీకర్‌ నాకు తండ్రిలాంటి వారు..

‘స్పీకర్‌ నాకు తండ్రిలాంటివారు. రాజకీయాలు ఏమన్నా ఉండొచ్చు. కానీ.. ఆయన మీద నాకు గౌరవం ఉంది. ఆయనకు అపార అనుభవం ఉంది. హుందాగా ఉండే.. ధర్మంగా ఉండే స్పీకర్‌ గారిని అడ్డం పెట్టుకొని మీరు (కేసీఆర్‌) ఇలాంటి పని చేస్తున్నారు. నేను స్పీకర్‌ను అవమానించలేదు. మీరే ఆయనను అవమానిస్తున్నారు. మీరు ఆయన స్థాయిని తగ్గిస్తున్నారు. క్షమాపణ చెప్పాల్సింది మీరు (కేసీఆర్‌).. నేను కాదు..’ అని సీఎం కేసీఆర్‌పై ఈటల ఎదురు దాడి చేశారు. ప్రజాస్వామ్య ముసుగులో కేసీఆర్‌ రాచరికపు పాలన చేస్తున్నారని, వీరి సంగతి మునుగోడు ఎన్నికల్లో తెలుస్తుందని హెచ్చరించారు.

అసెంబ్లీ ఔన్నత్యాన్ని కాపాడాలి..

అసెంబ్లీ సమావేశాలు మూడు విడతలు (బడ్జెట్‌ సమావేశాలు.. వర్షాకాల సమావేశాలు.. శీతాకాల సమావేశాలు) జరుగుతాయని, 60-80 రోజుల పాటు సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీ అని ఈటల పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు మాత్రం సమావేశాలను కుదించి ఇష్టం వచ్చినట్లు నడుపుకుంటున్నారని ఆరోపించారు. సభాపతి.. పార్టీలకు అతీతంగా శాసనసభ ఔన్నత్యాన్ని కాపాడాలని, సభ్యులకు అవకాశం కల్పించడం ఆయన పని అని స్పష్టం చేశారు. కేసీఆర్‌ రెండోసారి గెలిచిన తర్వాత సంప్రదాయాలను, మర్యాదలను తుంగలో తొక్కారని ఆరోపించారు. అన్నీ రూల్స్‌ ప్రకారమే ఉండవని, సంప్రదాయాలు కూడా ఉంటాయని నచ్చజెప్పారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని అజెండా సిద్ధం చేస్తారని.. నిన్న జరిగిన బీఏసీ సమావేశానికి మాత్రం బీజేపీ సభ్యులను పిలవనందుకు బాధ అనిపించడం వల్లే మీడియా పాయింట్‌లో మాట్లాడానని వివరించారు. ‘అసెంబ్లీ చాలా పవిత్రమైనది. ఆ పవిత్రత ప్రజా సమస్యలపై చర్చించినప్పుడే ఉంటుంది’ అని ఈటల హితవు చెప్పారు.

సీఎం ఇనుప కంచెల మధ్య ఉంటారు..

‘సీఎం ఇనుప కంచెల మధ్య ప్రగతి భవన్‌లో ఉంటారు. లేదా పోలీసు పహారా మధ్య ఫామ్‌హౌస్‌లో ఉంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం సీఎం దగ్గరికి వెళ్లాలంటే అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. ఇక సామాన్య ప్రజానీకానికి ఆయన దొరకనే దొరకరు. అందుకే తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని చాలా మంది మా దగ్గరికి వస్తున్నారు. అక్కడా మాట్లాడే అవకాశం లేకుండా చేస్తా అంటే బాధ కలగదా..? అయినా.. నేను ఎక్కడ కూడా అన్‌ పార్లమెంటరీ పదం వాడలేదు. పద్ధతి లేదా? అహంకారం ఎక్కువైందని మంత్రిగారు అంటున్నారు. నేను నలుగురు సీఎంలు, నలుగురు స్పీకర్లతో పని చేశాను. 20 ఏళ్లలో ఏ ఒక్కరూ నన్ను వేలెత్తి చూపించలేదు. కించపరిచేలా మాట్లాడానని ఎవరూ అనలేదు. ఇప్పుడు ఆ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ మూడు పార్టీలు కూడబలుక్కున్నాయి..

‘మజ్లిస్‌, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌.. మూడూ పార్టీలూ కూడబలుక్కుని మాట్లాడుకుంటున్నాయి. సమస్యలపై మాట్లాడాలని కోటి ఆశలతో అసెంబ్లీకి పోయినం. ఈటల రాజేందర్‌ ముఖం చూడొద్దని కేసీఆర్‌ అనుకున్నారట. అందుకే పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మా బెంచ్‌ దగ్గర ఉన్న మమ్మల్ని అకారణంగా సస్పెండ్‌ చేశారు. తొలిసారి అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులతో అరెస్టు చేపించారు’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘స్పీకర్‌ మీద, సభ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. స్పీకర్‌ అందరివాడు. మా హక్కులు కాపాడే ప్రయత్నం చేయాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అంతిమ నిర్ణేతలు ప్రజలే. తెలంగాణ ప్రజలు విజ్ఞులు.. చైతన్యవంతులు.. ధర్మాన్ని ఆచరిస్తున్న వారు.. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో వారికి బాగా తెలుసు.’ అని ఈటల స్పష్టం చేశారు.