Andhra PradeshHome Page Slider

నేతల మధ్య విభేదాలపై దృష్టి పెట్టిన జగన్

Share with

నేతల మధ్య ఉన్న అసమ్మతి రాగాన్ని తగ్గించి ఐక్యతారాగాన్ని పెంచేలా ప్రణాళికలు
నియోజకవర్గస్థాయి నేతల మధ్య విభేదాలు పరిష్కారం దిశగా అడుగులు
స్వయంగా రంగంలోకి జగన్..అసమ్మతినేతల మధ్య షేక్ హ్యాండ్

ఏపీలో రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటినుంచి టార్గెట్ 175 పేరుతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీంతో ప్రతి జిల్లా పైన ఆయన ఫోకస్ పెంచారు. అయితే కొన్ని జిల్లాల్లో నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరడంతో పార్టీకి నష్టం వాటిల్లక ముందే చర్యలకు ఉపక్రమించారు. పార్టీ బలంగా ఉన్న స్థానికంగా నేతల మధ్య చోటు చేసుకుంటున్న వివిధ సంఘటనల కారణంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కొంత వెనకబడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సర్వేలు ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుసుకుంటున్న జగన్ రాష్ట్రవ్యాప్తంగా నేతల మధ్య ఉన్న అసమ్మతి రాగాన్ని తగ్గించి ఐక్యతారాగాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకోసం జిల్లాల పర్యటననే వేదికగా పెట్టుకున్నారు.

ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనకు సీఎం జగన్ తరచుగా వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో రెండు రోజులపాటు ఆయా జిల్లాలోని బస చేస్తున్నారు. ఆ సమయంలోనే ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేల మధ్య ఉన్న అసమ్మతిని తగ్గించేలా వారి మధ్య దూరాన్ని తగ్గించేలా చేస్తున్నారు. అందుకోసం అసమ్మతినేతలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చి వారితో స్థానికంగా ఉన్న ఇబ్బందులు సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించేలా అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని ఒకటి రెండు జిల్లాల్లో ఇటీవల ముఖ్య నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు చాలావరకు సర్దుబాటు అయ్యాయి.

అలాగే రాయలసీమ పర్యటనలో భాగంగా కూడా కర్నూలు అనంతపురం జిల్లాలో పలువురు నేతలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను కూడా అక్కడికక్కడే చర్చించి సర్దుబాటు చేశారు. నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా ఇదే తరహాలో అందరిని ఒకే తాటి పైకి తీసుకొచ్చేలా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా పార్టీ నేతల మధ్య ఏదైనా విభేదాలు తలెత్తితే ఆయా ప్రాంతాలకు చెందిన రీజనల్ కోఆర్డినేటర్లు పరిధిలో పరిష్కారం చేసేవారు ఆయా జిల్లాలకు చెందిన రీజనల్ కోఆర్డినేటర్లు ఆయా ప్రాంతాలకు చెందిన నేతలతో భేటీ అయి చర్చించి వారి మధ్య ఉన్న విభేదాలను సర్దుబాటు చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయా ప్రాంతాలకు చెందిన నేతలను తాడేపల్లికి పిలిపించి చర్చించి పరిష్కారం చూపేవారు. అయితే తాజాగా అందుకు పూర్తిగా భిన్నంగా సీఎం జగనే స్వయంగా రంగంలోకి దిగి నియోజకవర్గస్థాయి నేతల మధ్య ఉన్న విభేదాలను కూడా ఆయనే స్వయంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలో దాదాపుగా నేతల మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా సర్దుబాటు అయ్యేదిశగా వాతావరణం కనిపిస్తుంది.

రెండు రోజుల క్రితం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పర్యటనకు వచ్చిన సీఎం జగన్ మాజీ మంత్రి నెల్లూరు సిటీ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఆయనకు స్వయానా బంధువైన నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ లను కలిపే ప్రయత్నం చేశారు. హెలిప్యాడ్ వద్ద ఇద్దరు నేతలను పిలిపించి స్వయంగా సీఎం జగనే అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్ యాదవ్ చేతులు కలిపారు. మీరు ఇలాగే కలిసి ఉండాలని వచ్చే ఎన్నికల్లో అనిల్ గెలుపు కోసం పనిచేయాలని రూప్ కుమార్ కు జగన్ స్వయంగా సూచించారు. అధినేత సూచనలతో ఇద్దరు చేతులు కలుపుకొని చిరునవ్వులు చిందించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలో కూడా ముఖ్యమైన నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్న నేపథ్యంలో వాటన్నింటిని కూడా సర్దుబాటు చేసే దిశగా జగన్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు.