Home Page SliderTelangana

బీఆర్ఎస్ పార్టీని ‘ఫాంహౌజ్ అరెస్టు’ చేసే సమయం వచ్చేసింది

Share with

కుటుంబ, అవినీతి సర్కారుకు వ్యతిరేకంగా మా పోరాటం మరింత ఉధృతం చేస్తామని నేడు ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీని ‘ఫాంహౌజ్ అరెస్టు’ చేసే సమయం వచ్చేసిందని పేర్కొన్నారు. కార్యకర్త స్థాయినుంచి.. ఇవాళ కేంద్రమంత్రిగా, 4వసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ తనకు అవకాశం కల్పించిందని సంతోషం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణలో జన ప్రభంజనం రానుందని, నిశ్శబ్ధ విప్లవం వస్తుందని, ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు కేంద్రమంత్రి. వెయ్యిమంది కేసీఆర్ లు, లక్షమంది ఒవైసీలు వచ్చినా.. వేలాది మంది రాహుల్ గాంధీలు కలిసివచ్చినా.. మోదీని ఢీకొట్టలేరు, బీజేపీని ఓడించలేరని వెల్లడి చేశారు.

1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకొని, యావత్త తెలంగాణ పోరాడితే వచ్చిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలోకి వెళ్లిందని, నేను, నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత నా మనవడు రాజులుగా ఉంటారు..మీరెప్పుడూ బానిసలుగానే ఉండాలన్నట్లు చూస్తున్నారు. బాటసింగారంలో డబుల్​ ఇండ్ల పరిశీలనకు వెళ్తాం అంటే హౌస్​ అరెస్ట్​ చేస్తున్నారు. హౌస్​ అరెస్ట్​ సంస్కృతి దేశంలో ఎక్కడా లేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బీఆర్​ఎస్​ సర్కారు కాలరాస్తున్నది. మేము అందరం పోరాటాలు చేస్తేనే.. పార్లమెంట్​లో మా ఎంపీలు మద్దతు ఇస్తేనే నువ్వు సీఎం కుర్చీలో కూర్చున్నావ్​ కేసీఆర్​ అంటూ మండిపడ్డారు.

మేము మీకు, మీ కుటుంబానికి బానిసం కాదు..వేల కోట్ల రూపాయల దోపిడీ చేస్తే.. ఎవరూ మాట్లాడొద్దా? పేదలకు ఇండ్లు ఇస్తానని ఇవ్వకుంటే.. మేం మాట్లాడొద్దా? అని మండిపడ్డారు. తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతున్నది.. ఒక తుఫాను రాబోతున్నది. అది బీజేపీకి అనుకూలంగా రాబోతున్నది. సింహం ఒక అడుగు ముందుకు వేసే ముందు… రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. తెలంగాణలో బీజేపీ కూడా అంతేనన్నారు.
తెలంగాణలో అనేక ఏండ్లు కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ పార్టీ చేయని అవినీతి, కుట్ర లేదు. బీఆర్​ఎస్​ పార్టీ కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక, ల్యాండ్​, లిక్కర్​ సహా అన్ని మాఫియాలే. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు.

ఈ నెల 24వ తేదీన డబుల్​ ఇండ్ల కోసం ధర్నాకు పిలుపునిస్తున్నం. 25న ఇందిరాపార్కులో పెద్ద ఎత్తున నిరసన చేపడుతాం. 2018 నుంచి కొత్త పెన్షన్లు రాలేదు.. పెన్షన్లు ఇచ్చే వరకు బీజేపీ పోరాటం చేస్తుంది. తొమ్మిదేండ్లుగా రేషన్​కార్డులు ఇచ్చే సోయి లేదు.. సీఎం కేసీఆర్​కు. ఇది దేశానికి ఆదర్శమా. 100 రోజుల్లో ప్రతి రోజూ ప్రజల పక్షాన మేము నిలబడి వారి మద్దతు కూడగడుతాం. నేను అధ్యక్షుడిని మాత్రమే.. అందరం కలిసి పోరాటం చేద్దాం.. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని అబిడ్స్​ చౌరస్థాలో పాతరేసే వరకు నిద్రపోయేది లేదు అంటూ విమర్శలు గుప్పించారు. 2024లో మోడీ నేతృత్వంలోని బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు.
ఈ దేశ ప్రజలు మోడీ లాంటి సమర్థనాయకత్వం కోరుకుంటున్నారని పేర్కొన్నారు.