Home Page SliderTelangana

కూన శ్రీశైలంగౌడ్‌ను నెట్టేసిన ఎమ్మెల్యే వివేకానంద

Share with

హైదరాబాద్, జీడిమెట్ల: ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చావేదికలో భూ ఆక్రమణల విషయంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య పరస్పర నిందారోపణలు ఉద్రిక్త పరిస్థితికి దారితీశాయి. నగరంలోని సుభాష్‌నగర్ డివిజన్ సూరారం కాలనీ రామ్‌లీలా మైదానంలో బుధవారం ఒక టీవీ ఛానల్ నిర్వహించిన నియోజకవర్గంలో గెలుపెవరిది అనే టాపిక్‌పై చర్చ నడుస్తోంది.

   కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి.. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి కొలను హన్మంత్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ నియోజకవర్గంలో దశలవారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. శ్రీశైలంగౌడ్ జోక్యం చేసుకుని భూ ఆక్రమణలను మీరు ప్రోత్సహిస్తుండడంతో సమస్యలు వస్తున్నాయని విమర్శించడంతో పరస్పరం వాగ్వాదం చేసుకున్నారు. నువ్వు భూ కబ్జాలకు  పాల్పడుతున్నావంటే.. నువ్వే ఆక్రమణలకు పాల్పడుతున్నావంటూ ఒకరిపై ఒకరు నిందారోపణలు తారాస్థాయిలో చేసుకున్నారు.

     మీ తండ్రి కూడా కబ్జాలు చేశాడు అని శ్రీశైలంగౌడ్ ఆరోపించడంతో ఎమ్మెల్యే ఆయన వద్దకు వెళ్లి నెట్టేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకు పంపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం శ్రీశైలంగౌడ్ సూరారం ఠాణాలో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. శ్రీశైలంగౌడ్‌పై వివేకానంద దాడి దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ వారు దాడులకు దిగుతున్నారన్నారు.