NewsTelangana

అదేమైనా నిషేధ పదమా?

Share with

‘మర మనిషి ఏమైనా నిషేధ పదమా? స్పీకర్‌ను మర మనిషి అంటే సభా సంప్రదాయాలను అగౌరవపరిచినట్లా? బల్లలు ఎక్కినప్పుడు, మైకులు విసిరినప్పుడు, గవర్నర్‌ కుర్చీని తన్నినప్పుడు సభా సంప్రదాయం గుర్తురాలేదా?’ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పటికీ సీపీఎం, లోక్‌సత్తా పార్టీలను బీఏసీ సమావేశాలకు పిలిచారని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నా ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలు బీఏసీ సమావేశంలో ఎందుకు అడగలేదని నిలదీశారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలన్నీ ఒక తాను ముక్కలే అన్నారు. 12, 13 తేదీల్లో జరిగే సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కాకుండా కేసీఆర్‌ సర్కారు కుట్ర చేస్తోందన్నారు. ఏ సంప్రదాయం ప్రకారం తమకు నోటీసులిస్తారని ప్రశ్నించిన రఘునందన్‌ ఆ నోటీసులను న్యాయస్థానంలో సవాల్‌ చేస్తామన్నారు.