Home Page SliderNational

“వీర్ గార్డియన్- 2023” లో భారత ధీరమహిళ

Share with

యుద్ధవిమానాల విన్యాసాలు టీవీలో చూస్తేనే మనకు ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది ఆ యుద్ధవిమానాన్ని ఒక మహిళ అవలీలగా నడపడం గొప్ప విశేషమే. , ఆమె ఎవరో కాదు ‘అవని చతుర్వేది’. భారత్- జపాన్‌ దేశాలు కలిసి సంయుక్తంగా “వీర్ గార్డియన్ 2023” ఎక్సర్‌సైజ్ పేరుతో వైమానిక విన్యాసాలు నిర్వహించబోతున్నాయి.

భారత్, జపాన్‌ల మధ్య సైనిక సంబంధాలు దృఢపరిచే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ నెల (జనవరి) 12వ తేదీ నుండి 26 వతేదీ వరకు జపాన్‌లోని ఎయిర్ బేస్‌లో ఈ విమాన విన్యాసాలు జరుగబోతున్నాయి. ఈ కార్యక్రమంలో 150 మంది సైనికులు పాల్గొనబోతున్నారు. వీరిలో ఏకైక మహిళ అవనిచతుర్వేది కావడం గొప్పవిశేషం. ఈమె సుఖోయ్-mki యుద్ధ విమానంతో విన్యాసాలు చేయబోతోంది.

భారత వైమానిక దళంలో మొదటిసారిగా ముగ్గురు మహిళా పైలట్లను నియమించారు. వారిలో అవని కూడా ఒకరు. అంతే కాక 1993లో జన్మించిన ఆమె, వయస్సులో మిగిలిన వారికన్నా చిన్నది. మిగ్-21, బైసన్, సుఖోయ్ వంటి కష్టమైన యుద్ధ విమానాలను నడిపిన ఘనత ఆమెదే. ఇలా విదేశాలలో జరిగే వైమానిక ప్రదర్శనలో పాల్గొనే మొదటి మహిళ కూడా ఆమే. అవని అన్నయ్య ఆర్మీ ఆఫీసర్ కావడంతో, అతనిలాగే ఆర్మీలో పనిచేయాలని స్ఫూర్తి పొందింది. తనకు ఇష్టమైన వాయుసేనలో చేరాలని, డిగ్రీ చదువుతున్నప్పుడే నిర్ణయించుకొంది. కాలేజిలోని ఫ్లైయింగ్ క్లబ్‌లో చేరింది. ప్రతిరోజూ గంటల తరబడి విమానయాన శిక్షణ తీసుకునేది. అనంతరం తన కోరిక మేరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో చేరింది. 2016లో యుద్ధవిమాన పైలట్‌గా ఎంపికైంది.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆమె హైదరాబాద్‌లోని దుండిగల్, హకీంపేట, బీదర్ ఎయిర్ బేస్‌లలో శిక్షణ పొందింది. రష్యాకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధవిమానాన్ని నడిపింది. దీనిని నడపడం చాలా సాహసంతో కూడుకున్న పని. ఈ విమానం ప్రపంచంలోనే అత్యధిక ల్యాండింగ్ స్పీడ్, టేకాఫ్ స్పీడ్ కలిగిఉంది. గంటకు 340 కిలోమీటర్ల వేగంతో గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ నుంచి అరగంట సేపు నడిపింది అవని. ప్రస్తుతం సుఖోయ్-mki  యుద్ధవిమానానికి పైలెట్‌గా పని చేస్తోంది ఈ యువ నారీ కెప్టెన్.