Home Page SliderInternationalNational

భారతీయ ముస్లింలు భళా, యూరప్ దేశాల ఆరోపణలపై నిర్మల కౌంటర్

Share with

దేశంలో పెట్టుబడులను ప్రభావితం చేసే విధంగా… కొన్ని యూరప్ దేశాలు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారతదేశాన్ని ఒక్కసారి కూడా పర్యటించకుండా, రివ్యూలు చేస్తున్నవారు ఒక్కసారి గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలించాలని ఆమె కోరారు. కట్టుకథలు వినడం కంటే… ఇండియాకు వచ్చి చూసి అవగాహన పెంచుకోవాలని పెట్టుబడుదారులకు ఆమె హితవు పలికారు. భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వృద్ధిపై పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (PIIE)లో చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని పక్కనబెట్టాలని ఆమె కోరారు. భారతదేశానికి వచ్చే పెట్టుబడిదారుల వద్ద ఇందుకు సంబంధించి పూర్తి క్లారిటీ ఉందని ఆమె చెప్పారు. పెట్టుబడుదారులు వస్తున్నారు. పెట్టుబడులను స్వీకరించడానికి ఆసక్తి ఉన్న వ్యక్తిగా, భారతదేశంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి అని మాత్రమే నేను చెబుతానన్నారు. గ్రౌండ్‌ లెవల్లో పర్యటించకుండా వ్యక్తులు, నివేదికల అభిప్రాయాలను వినడం మాని నేరుగా సందర్శించాలని PIEE ప్రెసిడెంట్ ఆడమ్ ఎస్ పోసెన్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు.

దేశంలో ప్రత్యర్థి పార్టీలోని ఎంపీలు హోదాను కోల్పోతున్నారని, భారతదేశంలోని ముస్లిం మైనారిటీలు హింసకు గురవుతున్నారని పశ్చిమ పత్రికల్లో వచ్చిన నివేదికలపై సీతారామన్‌ను ప్రశ్నించారు. “భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది, ఆ జనాభా సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ కొందరు తప్పుబడుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల వారు కష్టాలు అనుభవిస్తున్నారంటున్నారు. ఒకవేళ ప్రభుత్వాలు అలా చేసి ఉంటే, 1947 తర్వాత ఇండియాలో ముస్లిం జనాభా పెరిగి ఉండేదా అంటూ ఆమె బదులిచ్చారు. పాకిస్తాన్‌లో మైనారిటీల పరిస్థితి మరింత దిగజారుతోందని… వారి సంఖ్య రోజురోజుకు క్షీణిస్తోందని, పాకిస్తాన్‌లో మైనారిటీలు చిన్న చిన్న ఆరోపణలకే తీవ్ర అభియోగాలు మోపుతున్నారని, మరణశిక్ష వంటి శిక్షలు విధిస్తున్నారని ఆమె అన్నారు. దైవదూషణ చట్టాలు, చాలా సందర్భాలలో, వ్యక్తిగత పగ తీర్చుకోవడానికి ఉపయోగించబడతున్నాయన్నారు. సరైన విచారణ లేకుండా, జ్యూరీ కింద విచారణ జరపకుండా బాధితులు వెంటనే దోషులుగా చిత్రీకరిస్తున్నారన్నారు.

దేశం ఇండియా, పాకిస్తాన్‌గా విభజించబడిందని… పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకొని… మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ప్రతిజ్ఞ చేసిందన్నారు నిర్మలా సీతారామన్. కానీ ఇప్పుడు పాకిస్తాన్‌లో మైనారిటీ సంఖ్య తగ్గిపోతోందని, కొన్ని ముస్లిం వర్గాలను కూడా నిర్మూలిస్తున్నారని అన్నారు. పాకిస్థాన్‌లో ఉన్న ముస్లింల కంటే భారతదేశంలోని ముస్లింలు మెరుగ్గా పనిచేస్తున్నారని ఆమె నొక్కి చెప్పారు. పాకిస్తాన్‌లో “ముహాజిర్లు, షియా, ఇతర సమూహాలపై హింస ప్రబలంగా ఉందని… బహుశా సున్నీలపై కూడా ఉందేమోనన్నారు. కానీ భారతదేశంలో ముస్లింలు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారని… పిల్లలను బాగా చదవిస్తున్నారని… ప్రభుత్వం ఫెలోషిప్‌లు ఇచ్చి సహకరిస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.

ఇండియాలో ముస్లింలు బాధితులవుతున్నారన్న ఆరోపణలను సీతారామన్ ఖండించారు. భారతదేశంలో ముస్లింలను ప్రభావితం చేసేలా హింస జరుగుతుంటే, అది కేవలం ప్రచారం, అపోహ మాత్రమేనన్నారు. 2014 తర్వాత ఇండియాలో ముస్లిం జనాభా తగ్గిందా? ఒక వర్గం మరణాలు ఎక్కువయ్యాయా? ఇవన్నీ కల్పితాలు మాత్రమేనని నిర్మలా చెప్పుకొచ్చారు. నివేదికలు రూపొందించేవారిని, రాసే వారిని భారతదేశానికి రమ్మని ఆహ్వానిస్తున్నానన్నారు కేంద్ర మంత్రి. భారతదేశానికి వస్తే.. వారు రాస్తున్నవి, కట్టుకథలు, తప్పని రుజువవుతాయని చెప్పారు. ఇలాంటి రాతలు… పురోగమిస్తున్న ఇండియాకు భారంగా మారుతున్నాయన్నారు. కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రబల శక్తిగా ఎదుగుతోందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ అన్ని దేశాల వాదలను వినాలని… ప్రగతిశీలంగా, న్యాయబద్ధంగా ఉండాలని ఆమె కోరారు. భిన్న ఆలోచనలపై స్పందించాలన్నారు.