Home Page SliderNational

ఉగ్రరూపం దాల్చనున్న బిపర్‌జోయ్ తుఫాన్ -ద్వారక తీరంలో భారత కోస్ట్‌గార్డ్ సాహసం

Share with

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఉగ్రరూపాన్ని దాల్చుతోంది బిపర్‌జోయ్ తుఫాన్. అరేబియా సముద్రతీర ప్రాంతాలను వణికించేస్తోంది. కచ్, సౌరాష్ట్ర ప్రాంత వాసులకు ఇళ్ల నుండి బయటకు రావద్దని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. గుజరాత్‌లోని మాండ్వీ- పాకిస్థాన్‌లోని కరాచీ మధ్య ఈ తుఫాన్ గురువారం నాటికి తీరం దాటవచ్చని అంచనాలు వేస్తున్నారు వాతావరణ శాఖ. ద్వారకలోని సముద్రతీరం కూడా భయానకంగా మారింది. ఆస్తి, ప్రాణనష్టం అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ద్వారక వద్ద 15 నుండి 20 అడుగుల ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది ద్వారకలోని ఆయిల్ రింగ్ వద్ద పని చేస్తున్న 50 మంది సిబ్బందిని ప్రాణాలకు తెగించి కాపాడి, హెలికాఫ్టర్‌లో తరలించారు. కోస్ట్‌గార్డ్‌కు చెందిన శూర్ అనే వాహక నౌక, ఎంకే -3 అనే హెలికాఫ్టర్ల సాయంతో ఈ 50 మందిని రక్షించారు.  

 మాండ్వీతీరంలో అల్లకల్లోలంగా మారింది అరేబియా సముద్రం. గుజరాత్‌లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తుఫాన్‌కు తీరం దాటే సమయంలో భారీ విధ్వంసం సృష్టించే సామర్థ్యం ఉందని భారత వాతావరణ శాక డైరక్టర్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. గుజరాత్‌లోని జఖౌ తీరంలో ఈ తుఫాన్ గురువారం సాయంత్రానికి తీరం దాటనుంది. ఆసమయంలో ద్వారక, జామ్‌నగర్, కచ్, మోర్బీ జిల్లాలలో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని తెలియజేశారు.