Home Page SliderNational

ఢిల్లీలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్

Share with

బీహార్ సీఎం నితీష్ కుమార్‌ను కలిసిన ఒక రోజు తర్వాత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాలుగు రోజుల పర్యటన కోసం న్యూఢిల్లీకి వచ్చారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీకి సమాన దూరంగా ఉన్న బీజేడీ అధినేత ఢిల్లీ రాక, దేశ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతలో భాగంగా నవీన్ పట్నాయక్ అడుగులు వేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. పట్నాయక్ దేశ రాజధాని పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులతో సమావేశాలతో సహా అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అదే సమయంలో విపక్ష నేతలతోనూ ఆయన భేటీ కానున్నట్టు తెలుస్తోంది. మే 13న పట్నాయక్ ఒడిశాకు తిరిగి వెళ్తారు.

పట్నాయక్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన 2024 ఎన్నికలకు ముందు విపక్షాల మధ్య సయోధ్య దిశగా సాగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఢిల్లీలో నవీన్ పట్నాయక్, బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో టచ్‌లో ఉన్న కొంతమంది ప్రతిపక్ష నాయకులను కలవవచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి కౌంటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నవీన్ పట్నాయక్ ఢిల్లీ పర్యటన ఉందన్న చర్చ విన్పిస్తోంది. బీజేపీకి దూరంగా ఉంటున్న బీజేడీ, పార్లమెంట్‌లో అనేక బిల్లులకు మద్దతిస్తూ వస్తోంది.

ఇప్పటి వరకు నవీన్ పట్నాయక్ బీజేపీకి మద్దతిస్తున్నందున ఒడిశాలో సీబీఐ, ఈడీ దాడులు జరగడం లేదంటూ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు నరసింఘ మిశ్ర. అయితే, బీజేడీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ విమర్శించారు. పట్నాయక్ బలవంతం చేయడం వల్ల తాము, 2000-2009 మధ్య ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సివచ్చిందన్నారాయన. అయితే తమ పార్టీ ఒడిశా ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని బీజేడీ ఉపాధ్యక్షుడు ప్రసన్న ఆచార్య అన్నారు.