Andhra PradeshHome Page Slider

వైకుంఠఏకాదశి రోజు ఏంచేయాలంటే?

Share with

సూర్యభగవానుడు ఉత్తరాయణానికి మారే మకరసంక్రాంతికి ముందుగా వచ్చే ధనుర్శాసంలోని శుక్లపక్షఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠఏకాదశిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం జనవరి 2 వతేదీనే ఈ పుణ్యదినం వచ్చింది. ఈ రోజు విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటాడని అంటారు.  ఈ దినాన విష్ణు భగవానుడు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేస్తాడని భక్తుల విశ్వాసం. ఈ శుభదినాన విష్ణు ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. ఇలా ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి, స్వర్గం ప్రాప్తిస్తుందని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది.

ఈ ఏకాదశికి ఏడాది మొత్తం వచ్చే 24 ఏకాదశుల కంటే అత్యంత విశిష్టత ఉంది.. వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ, ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి. ఏకాదశి తిథి విష్ణు మానస పుత్రిక అని నమ్మకం. ఈ ఏకాదశి నాడు అమృతం కూడా క్షీరసాగరం నుండి ఉద్భవించిందని పండితులు అంటారు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జనునికి ఈ రోజునే భగవద్గీతను ఉపదేశించాడని భక్తుల విశ్వాసం. తాను తిథులలో ఏకాదశి వంటి వాడినని శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. అందుకే ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం, గీతాపారాయణం, గోవిందనామస్మరణం, పురాణ పఠనం వంటి కార్యాలు మోక్షప్రాప్తిని కలిగిస్తాయి.

కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో ఈ రోజున శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠద్వారాన్ని తెరిచి భక్తులకు ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో దర్శనం ఏర్పాటు చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనం అనుమతినిచ్చింది.

మహద్వారం నుండి గర్భాలయం వరకు రకరకాల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. 12 టన్నుల పూలతో ద్వారాలను, ధ్వజస్తంభాన్ని, ఆనందనిలయాన్ని అలంకరించారు. భక్తులు పరమ పవిత్రమైన ఈరోజున స్వామివారిని దర్శించుకోవడానికి పోటెత్తారు.