National

ఆహార పదార్థాలు ఎలా కలిపి తీసుకోరాదు

Share with

ప్రతిజీవి జీవితంలోనూ ఆహారం ముఖ్యపాత్ర వహిస్తుంది. అయితే మానవుడొక్కడే ఆహారాన్ని వండుకొని, దాని స్థితిని మార్పుచేసి, తింటారు. మన పూర్వులు ఆహార పదార్థాలను కొన్ని విభాగాలుగా విభజించారు. ఏది మంచిదో, ఏది కాదో, ఏ పదార్థం ఎంతమేరకు తీసుకోవాలో ఆయుర్వేద నిపుణులు తెలియజేసేవారు.

కొన్ని రకాల పదార్థాలను కొన్నింటితో కలిపి తీసుకుంటే కొన్ని అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ దోషాలకు అనుగుణంగా ఆహారానికి లక్షణాలు ఉంటాయని.. అందువల్ల అలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదని చెపుతున్నారు. వాటి వివరాలు చూద్దాం.

పాలు, తులసి

ఈ రెండూ మనకు మేలు చేసేవే అయినా కలిపి తీసుకోరాదని, కనీసం అరగంట విరామం ఉండాలంటున్నారు వైద్యులు.

చేపలు, పాలు

ఆయుర్వేద సూత్రాల ప్రకారం ఈ రెండు ఆహారాలు పరస్పర విరుద్ద లక్షణాలు కలిగి ఉంటాయి.

బంగాళా దుంపలు, చికెన్, గుడ్లు

ఆలుగడ్డలలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న చికెన్, గుడ్లు వంటి ఆహారంతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియకు ఇబ్బంది ఎదురవుతుందని నిపుణులు అంటున్నారు.

వేడి పదార్థాలు, తేనె

తేనెతో వేడి పదార్థాలు కలిపి తీసుకుంటే అందులో పోషకాలు నశించిపోతాయని ఆయుర్వేద శాస్త్రం చెపుతోంది.

దోసకాయ, టమాటా

వీటి లక్షణాలు విరుద్ధంగా ఉంటాయి. వీటికి పెరుగు, నిమ్మకాయ కూడా జత చేయకూడదని అంటున్నారు. పెరుగు రైతాలో దోస, టమాట వేసుకోవడం, సలాడ్లపై నిమ్మరసం వేయడం మంచిది కాదని పేర్కొంటున్నారు.

పాలు, పుల్లటి పండ్లు

పులుపు ఉండే పళ్లను, పాలను కలిపి తీసుకోరాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏ పళ్లను కూడా పాలతో తీసుకోరాదని, మంచిది కాదని శాస్త్రం చెపుతోంది.

పాలకూర, నువ్వులు

ఈరెండూ కలిసి తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుందని, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుందని వారి అభిప్రాయం.

బెల్లం, పెరుగు

ఈ రెండూ కలిపి తింటే వేగంగా బరువు పెరిగే అవకాశం ఉందని, జలుబు, దగ్గు వంటివి వస్తాయని, వాటిమధ్య విరామం ఇచ్చి తినవచ్చని అంటున్నారు.

నెయ్యి, తేనె

ఈ రెండూ కలిపితే తేనె రెండు వంతులు, నెయ్యి ఒకవంతు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తృణ ధాన్యాలు, పండ్లు

వివిధ రకాల తృణ ధాన్యాలు, పండ్లను ఒకేసారి కలిపి తీసుకోవడం మంచిది కాదని ఆయుర్యేద నిపుణుల అభిప్రాయం. వివిధ దోషాలు తలెత్తే అవకాశాలున్నాయంటున్నారు.

అయితే ఈ సూచనలు ఆయుర్వేదాన్ని నమ్మి ఆచరించే వారికేనని, వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు.