Andhra PradeshHome Page Slider

అమరావతిలో ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు స్టే

Share with

ఆర్ 5 జోన్‌లోని ఇళ్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ జరిగే ఇళ్ల నిర్మాణాలను ఆపివేయాలని పేర్కొంది. అమరావతి పరిధిలోని భూ పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై కోర్టుకి వెళ్లారు అమరావతి రైతులు. ఈ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకునే వరకూ ప్రభుత్వం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ ప్రస్తుతానికి హైకోర్టు స్టేను విధించింది. 10 రోజుల క్రితమే ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రిసభ్య కమిటీతో కూడిన హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలోని ఈ జోన్‌ను ఏర్పాటు చేశారు. 1405 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్లనిర్మాణ ప్రక్రియను సవాల్ చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ సమాఖ్య హైకోర్టులో కేసులు వేశాయి. వీటిపై ఈ తీర్పు వెలువడింది.  ఇప్పటికే ఇళ్ల పట్టాలను జారీ చేసింది ఆంధ్రప్రభుత్వం. ఇది ఖచ్చితంగా తమ విజయమే అంటూ రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రదేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అలాంటి స్థలంలో పేదలకు ఎలా ఇళ్లు కేటాయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. దీనితో ప్రస్తుతానికి ఈ కార్యక్రమం ముందుకు కొనసాగే పరిస్థితులు లేవు.