Home Page SliderTelangana

చదువు మధ్యలో ఆపకుండా సాగేలా ప్రభుత్వ చర్యలు..

Share with

జిల్లాలోని 118 మంది సీఆర్పీలు, 26 మంది ఐఈఆర్పీలు తమ కాంప్లెక్స్ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. ఓఎస్సీ పేరిట నిర్వహించే సర్వే ద్వారా 6, 14 ఏళ్ల పిల్లలను, అదేవిధంగా కళాశాల స్థాయిలో 15, 19 ఏళ్ల పిల్లలను వేర్వేరుగా గుర్తించి, వివరాలను ప్రబంద్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. పిల్లలు, విద్యార్థులకు అవగాహన కల్పించి పాఠశాలల్లో చేర్పించాలి. అలాగే వేరే రాష్ట్రాల నుండి ఉపాధి కోసం ఇక్కడికొచ్చి పనిచేసుకుంటున్న వారి పిల్లల వివరాలు సేకరించాలి. డ్రాప్ బాక్స్‌లోని విద్యార్థులు ప్రస్తుతం ఏ పాఠశాలలో చదువుతున్నారో సమాచారం సేకరించాలి. పక్కరాష్ట్రాల్లో ఉండి ప్రస్తుతం సొంత ప్రదేశాలకు వచ్చిన విద్యార్థులను గుర్తించాల్సి ఉంటుంది. జిల్లాలోని 85 పాఠశాలల కాంప్లెక్స్‌ పరిధిలో జరుగుతున్న సర్వేను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సంబంధిత గ్రామాల్లో జరుగుతున్న సర్వేను పాఠశాల హెచ్ఎం నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే జనవరి 11న మండల స్థాయి బడిబయట సర్వే రిపోర్టును జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. జిల్లా స్థాయిలో పరిశీలించిన బడిబయట పిల్లల వివరాలను జనవరి 12న జిల్లా విద్యాశాఖ అధికారి ధ్రువీకరించి రాష్ట్రస్థాయికి పంపిస్తారు.

  అందరూ చదవాలి.. అందరూ జీవితంలో పైకిరావాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం. బడిబయట పిల్లల గుర్తింపు సర్వేకు శ్రీకారం చుట్టింది. బడిబయట, మధ్యలో చదువు మానేసిన పిల్లలను గుర్తించడమే కార్యక్రమ లక్ష్యం. పాఠశాలలకు రాని బడి ఈడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సోమవారం ప్రారంభమైన సర్వే జనవరి 11 వరకు కొనసాగుతుంది.