NationalNews

నాలుగు స్తంభాలాట..

Share with

అవసరం ఎంత పనైనా చేయిస్తుంది. అధికారం కోసం ఎన్ని ఆటలైనా ఆడిస్తుంది. మాటలను మారుస్తుంది. కూటములు కట్టిస్తుంది. అందరినీ కలుపుకు వెళుతున్నట్టు నటించి, అంతిమంగా పాలనా పగ్గాలు చేపడుతుంది. ఇదో రాజకీయ తంత్రం. కుతంత్రం అన్నా .. అదే ఇప్పుడు సరైన మంత్రంగా చెలామణి అవుతోంది. నిన్న ఎవరితో ఉన్నాం అన్నది కాదు ముఖ్యం ఇవాళ ఎవరితో కలిసి నడుస్తున్నాం అన్నదే ముఖ్యం. ఇదో రాజకీయ సిద్ధాంతం. ఇవాల్టి మిత్రులు రేపు శత్రువులుగా మారొచ్చు. రేపు ఆ శత్రువులే మళ్ళీ మిత్రులు కావచ్చు. ఇదో రాజకీయ పరిణామక్రమం. నాకు నువ్వేమిస్తావ్. ప్రతిగా నీకు నేనేమివ్వాలి.. ఇదో లావాదేవి. చిత్ర విచిత్రంగా అనిపించినా .. ఇదే ఇప్పుడు రాజకీయ యవనికపై కనిపిస్తున్న ప్రధాన చిత్రం. పెనవేసుకుంటే పాతవన్నీ మరిచి పోయినట్టే. చేతులు కలిపితే.. గతంలో చేసిన విమర్శలన్నీ తూచ్ అన్నట్లే. ఇదో ట్రెండ్. ఇప్పుడు అన్ని పార్టీలు ఎవరికీ అర్ధంకాని విధంగా అనుసరిస్తున్న అవకాశవాద సిద్దాంతం. దీనికి ఆజ్యులు, పూజ్యులు ఎంతో మంది ఉన్నా.. వారి స్ఫూర్తిని తూచా తప్పక అనుసరిస్తున్న నేత నితీష్ కుమార్.


ఎన్ని పార్టీలతో జత కట్టినా ఆయనకు కావాల్సింది అధికారం. బీజేపీతో ఉన్నా, కమ్యూనిస్టులతో కలిసినా తన సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు మార్చుకుని వారికి చెప్పాల్సింది చెప్పి తన పబ్బం గడుపుకోవడంలో మాస్టర్ డిగ్రీ చేసిన నేత నితీష్. నిన్న మొన్నటి వరకు ఎన్.డి.ఏ గూట్లో ఉన్నాడు. ఇప్పుడు మహాకూటమి పంచన చేరాడు. ఎక్కడ ఉన్నా అధికారాన్ని మాత్రం తానే దక్కించుకుంటాడు. ఆ టాలెంట్ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అయినా అందరూ ఆయనను ఇట్టే నమ్మేస్తారు. పగ్గాలు అప్పగించి .. కళ్ళప్పగించి చూస్తారు. తేరుకునే సరికి.. గూడూ మారుతుంది. గుట్లో గువ్వలూ మారి పోతాయి. ఇక మాటంటారా.. తేనెలో ముంచి తీసినట్టు తియ్యగా మాట్లాడతారు. ఆ మాటలే .. ఆయనకు వరాలు. అందుకే దశాబ్దాలు గడిచినా.. రాజకీయ తెరపై నితీష్ ఇంకా మెరుపులా మెరుస్తూనే ఉన్నాడు. తాజాగా ఆర్జేడీతో జట్టుకట్టిన నితీష్.. ఇప్పుడు మహా కూటమిని బలోపేతం చేసి .. బీజేపీని పడగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బీజేపీయేతర శక్తులన్నింటినీ ఏకం చేయాలని చూస్తున్నాడు. నిన్న వారితో కలిసున్నాడు. ఇవ్వాళ కంట్లో కారం కొట్టాలని చూస్తున్నాడు. మళ్ళీ నీతి నిజాయితీ, న్యాయం ధర్మం అంటూ.. చక్కటి ఉపన్యాసాలు.


ఇక తెలంగాణ ఇచ్చిన దేవతంటూ కేసీఆర్.. సోనియాకు మొక్కని మొక్కలు లేవు. కుటుంబ సమేతంగా ఆమె ఇంటికి వెళ్ళి మరీ సామూహికంగా మొక్కొచ్చారు. ఇప్పుడు ఆ దేవత వారికి మరో రూపంలో కనిపిస్తోంది. రాష్ట్రం ఇస్తే, టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తా అన్న పెద్ద మనిషి. ఆ పార్టీ మీద, తాను దేవతని పొగిడిన సోనియా కుటుంబం మీద చేయని విమర్శలు లేవు. అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. అవసరాలు తీరాయి. అధికారమూ దక్కింది. ఇంకా వారితో పనేంటి..? ఇదో వ్యక్తిత్వం. కుటుంబం కుటుంబం మొత్తం ప్రభుత్వంలో చేరిపోయింది. పదవులు పంచుకున్నారు. రేపు కుమారుడు కేటీఆర్ కి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించి .. తాను ప్రధాని కావాలన్న కాంక్ష. రాజకీయాలలో ఇవన్నీ తప్పు కాదు. కానీ.. చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండని వైనం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ ఎంతో మంది బాధితులు ఉన్నారు. వీరందరినీ వదిలి బీహార్ కు మూటలు పట్టుకెళ్ళి పంచొచ్చాడు. అక్కడ నితీష్ కలిసి మీడియా ముందుకూ వచ్చాడు. వారడిగిన ప్రశ్న ఒక్కటే. నితీష్ ను దేశ ప్రధానిగా మీరు అంగీకరిస్తారా అని. నో ఆన్సర్. పక్కనే ఉన్న నితీష్ చిరునవ్వులు చిందించాడు. వారి ఉచ్చులో పడకు.. లే.. అన్నా లేవకుండా కూర్చుండి పోయాడు. చేయిపట్టి లాగి నితీష్ ను కూర్చోమన్నాడు. తప్పదు గెస్ట్ కదా.. పైగా ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ డబ్బు పంచాడాయా. అదో గౌరవం. కూర్చుండి పోయాడు. ఇద్దరికీ మనసులో ఉన్నది బయటకు చెప్పలేదు. ప్రశ్నేసిన పాత్రికేయుడికి అర్ధమై పోయింది. ఊహల్లోకి వెళ్ళి పోయాడు. ఆ ఊహల్లో.. .అందరినీ ఐక్యం చేసి నితీష్, కేసీఆర్ మహా కూటమిని బలోపేతం చేస్తారు. అధికారమూ దక్కింది. వాట్ నెక్స్ట్. పదవి కోసం ఇద్దరి మధ్య లొల్లి. నితీష్ మళ్ళీ బయటకొస్తాడు. ఎవరి పంచకు వెళ్ళాలా అని చూస్తాడు. సీన్ రొటీన్.


ఇక మమత. బిజేపీ అంటేనే భగ్గు మంటుంది. అందరినీ కలిపి.. అందరితో కలిసి బీజేపీని నామరూపాలు లేకుండా చేయాలన్న కసి. కోపం. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీయేతర అభ్యర్ధిని నిలపడంలో కీలక పాత్ర పోషించింది. తన పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఉన్న యశ్వంత్ సిన్హాను తెరపైకి తెచ్చి రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేయించింది. కాంగ్రెస్ తో తప్ప అందరితో మాట్లాడింది. కానీ.. బలం లేక ,, విపక్షాల మధ్య ఐక్యత లోపించి.. యశ్వంత్ సిన్హా ఓడి పోయాడు. ఆ వెంటనే ఉప రాష్ట్రపతి ఎన్నికలు వచ్చేశాయి. కానీ.. మమత కిమ్మనలేదు. ఉప రాష్ట్రపతి ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. నిన్నకాక మొన్న బీజేపీకి మాతృస్ధానమైన ఆర్ఎస్ఎస్ ను పొగడ్తలతో ముంచేసింది. అసలు ఆమె సిద్ధాంతం ఏంటి..? అంతా అయోమయం. బెంగాల్ ను అల్లుడు అభిషేక్ కి అప్పగించి తాను కేంద్రంలో చక్రం తిప్పాలన్న ఆలోచన మమతలో ఎప్అపటి నుండో ఉంది. ఈ క్రమంలోనే ఆమె బిజేపీయేతర శక్తులన్నింటినీ కూడగట్టి పనిలో పడింది. అయితే అదంతా సాధ్యమయ్యే పనిగా ఆమెకే కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో బీజేపీనీ కదిలించే శక్తి ఏ పార్టీకి లేదని ఆమెకు కూడా తెలుసు. కానీ.. ఇప్పటి నుండే ప్రయత్నిస్తే .. ఒకప్పటికి వర్కవుట్ అవుందన్న ఆశ. ఆ పరిస్థితే వస్తే.. వీరి కూటమి అఖండ విజయం సాధిస్తే.. ప్రధాని పదవిపై కన్నేసిన నితీష్, కేసీఆర్, కేజ్రీవాల్ వంటి మహామహులను దాటుకుని మమత ఆ పదవి దాకా వెళ్ళే అవకాశాలే లేవు. కాబట్టి వీరి ప్రయత్నాలు విఫలమే అన్న భావన విపక్షాల్లోని ఓ వర్గం నుండి వినిపిస్తోంది.


స్వప్రయోజనాల కోసం ఒకరు .. స్వజనం కోసం మరొకరు.. స్వీయ పదవి కోసం ఇంకొకరు. వీరందరి ఉద్దేశం ఒకటే. తమ మాట నెగ్గాలి. తామే గెలవాలి. తాము అనుకున్నది జరగాలి. పైకి టార్గెట్ బీజేపీ అంటూనే తమ పదవీ కాంక్షను తీర్చుకునేందుకు ఎత్తులు.. జిత్తులు. అవసరమైతే పడగొట్టుడు. వీరు సన్మార్గులు.. ఎదుటి వారు దుర్మార్గులు. అంతుబట్టని వీరి సిద్ధాంతం ఓ పెద్ద వేదాంతం. భగవాన్ క్యాహే తేరీ లీలా.. లీలా తేరీ తూహీ జానే.