Home Page SliderNational

బీజేపీలోకి ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ

Share with

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ ఈరోజు బీజేపీలో చేరారు. 2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై BBC యొక్క డాక్యుమెంటరీపై వివాదం సమయంలో అనిల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ నేతలు పీయూష్ గోయల్, వీ మురళీధరన్, ఆ పార్టీ కేరళ యూనిట్ చీఫ్ కే సురేంద్రన్ సమక్షంలో అనిల్ బీజేపీలో చేరారు. “ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తాము ఒక కుటుంబం కోసం పనిచేస్తున్నామని నమ్ముతారు. కానీ నేను దేశం కోసం పనిచేస్తున్నానని నేను నమ్ముతున్నాను” అని అనిల్ ఆంటోనీ, బీజేపీలో చేరిన తర్వాత వ్యాఖ్యానించారు. “ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామి స్థానంలో ఉంచడంపై ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టమైన దృష్టి ఉంది” అని అనిల్ అన్నారు. అనిల్ ఆంటోనీ, కాంగ్రెస్ పార్టీని వీడే ముందు కేరళ, కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్‌ను నడిపారు. పార్టీని వీడే ముందు BBC డాక్యుమెంటరీ “భారతదేశంపై పక్షపాతంతో” కూడుకున్నదని విమర్శించి వివాదాస్పదమయ్యారు.

అనిల్ ఆంటోనీ బహుముఖ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, విద్యార్హతలు చూసినప్పుడు ఎంతో ఆసక్తి కలిగిందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అనిల్ అభిప్రాయాలు సుస్థిర అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయని గోయల్ తెలిపారు. అనిల్ బీజేపీలో చాలా చురుకైన పాత్రను కొనసాగిస్తాడని, దక్షిణ భారతదేశంలో బీజేపీ రాక పార్టీని విస్తృతం చేస్తోందని నమ్మకం ఉందన్నారు గోయల్. అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాల్సి ఉంటుంది. ఏకే ఆంటోనీ అనుభవజ్ఞుడిగా, విధేయుడుగానీ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు పొందాడు. రక్షణ మంత్రిగా వ్యవహరించారు. అనిల్ ఆంటోనీ తన తండ్రికి ద్రోహం చేశాడని, దీనిని ‘ద్రోహ దినం’గా హస్తం పార్టీ అభివర్ణించింది. బీజేపీలో చేరే అధికారిక కార్యక్రమంలో అనిల్ ఆంటోనీ మాట్లాడుతూ, తాను సరైన అడుగు వేశానని నమ్ముతున్నానని అన్నారు. “ఇది వ్యక్తిత్వాల గురించి కాదు, ఇది అభిప్రాయ భేదాలు, ఆలోచనల గురించి. నేను సరైన చర్య తీసుకున్నానని నేను గట్టిగా నమ్ముతున్నాను. తండ్రిపై నా గౌరవం అలాగే ఉంటుంది” అని విలేకరులు అడిగినప్పుడు అనిల్ చెప్పుకొచ్చాడు.

అనిల్ ఆంటోనీ రాకతో కేరళలో బీజేపీకి ఊపు వస్తోందని కమలనాథులు భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు, ముఖ్యంగా క్రైస్తవుల నుండి మద్దతును సేకరించవచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. కేరళలో వామపక్ష కోటను బీజేపీ సమర్థవంతంగా ఛేదించలేకపోయింది. అనిల్ రాకతో ఆ లక్ష్యం నెరవేరుతుందని పార్టీ యోచిస్తోంది. అనిల్ ఆంటోనీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ త్రివేండ్రం నుంచి బీటెక్ చేశారు.