Home Page SliderTelangana

ట్రైన్ యాక్సిడెంట్‌లో దుర్మరణం పాలైన తండ్రీకూతురు

Share with

బాసర సరస్వతీదేవీ దర్శనానికి వెళ్తూ తండ్రి, కుమార్తె రైలు ప్రమాదంలో మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ శుక్రవారం తెల్లవారు జామున జరిగింది.

నిజామాబాద్: బాసర సరస్వతీదేవీ దర్శనానికి వెళ్తూ తండ్రి, కుమార్తె రైలు ప్రమాదంలో మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో శుక్రవారం  తెల్లవారు జామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి చెందిన రామచంద్రరావు (45) ఖమ్మంకి చెందిన సునీతతో 17 ఏళ్ల క్రితం  వివాహమైంది. ఆయన ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జస్మిత ఇంటర్, చిన్న కుమార్తె జనని (15) టెన్త్ క్లాస్ చదువుతోంది. శుక్రవారం బాసరలో సరస్వతీ దేవికి పూజ చేసేందుకు నలుగురు గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరారు. రామచంద్రరావు, సునీత ఒక బోగీలో, ఇద్దరు కుమార్తెలు మరో బోగీ ఎక్కారు. నిజామాబాద్‌లో అందరూ ఒకే బోగీలోకి మారేక్రమంలో రైలు దిగి, భార్య ఉన్న బోగీలోకి పెద్దకుమార్తె జస్మితను ఎక్కించారు. చిన్న కుమార్తె జననిని అదే బోగీలోకి  ఎక్కిస్తుండగా రైలు ముందుకు కదిలింది. జనని పట్టుతప్పి రైలు కింద పడిపోయింది. ఆమెను పైకి లాగేందుకు ప్రయత్నించిన తండ్రి రామచంద్రరావు సైతం రైలు, పట్టాల మధ్య ఇరుక్కుపోయారు. జనని అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్రగాయాలైన రామచంద్రరావును స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కళ్లెదుటే భర్త, చిన్న కుమార్తె మృతి చెందడంతో సునీత కుప్పకూలింది. వారి మృతదేహాలపై పడి ఆమె విలపిస్తున్న తీరు చూపరులను బాధకు గురిచేసింది.