Andhra PradeshHome Page Slider

కోటి మైలురాయి దాటిన ‘ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్’

Share with

 ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబరు 22 వ తేదీన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకూ కోటి మందికి పైనే ఈ కాన్సెప్ట్ ద్వారా ఇళ్లకు వెళ్లి మరీ పేషెంట్లకు ట్రీట్‌మెంట్లు ఇచ్చారని వివరించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని, పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్ ల పనితీరు మెరుగుపరిచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం జగన్ అధికారులను అదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీకి స్పెషల్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. మంగళవారం నాడు జరిగిన ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సంలో ప్రారంభం కానున్న కొత్త మెడికల్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. కొత్త మెడికల్‌ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే నూతన అడ్మిషన్లు ప్రారంభించి తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్‌ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వహిస్తామని ఆయా కాలేజీల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

విలేజ్‌ క్లినిక్‌ స్ధాయిలో కంటి పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో పాటు ఇతర వైద్య సేవలు అవసరమైన పేషెంట్‌కు చికిత్స అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసేలా చూడాలని సీఎం జగన్ సూచించారు. ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలన్నారు. క్యూ ఆర్‌ కోడ్‌ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.