Home Page SliderTelangana

లాల్ దర్వాజాలో నకిలీ స్వీట్ల దందా

Share with

హైదరాబాద్‌లోని లాల్ దర్వాజాలోని ఓ ఇంట్లో నకిలీ స్వీట్ల దందా బయటపడింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా హైదరాబాద్ చందానగర్, మలక్ పేట ఏరియాలలో నకిలీ చాక్లెట్లు, నకిలీ ఐస్‌క్రీమ్‌ల విషయం బయటపడింది. ఇప్పుడు నకిలీ స్వీట్లు వంతు వచ్చింది. ఏ ఇంట్లో ఏ నకిలీ పదార్థాలు తయారవుతున్నాయో ఆ ఈశ్వరునికే ఎరుక. కోట్ల జనాభా గల ఈ మహానగరంలో ఇలాంటివి కనిపెట్టడం కత్తి మీద సాము లాంటిదే. స్వచ్చమైన పాల స్వీట్లుగా చెప్పుకుంటున్న ఈ స్వీట్లు నిజంగా పాలతో కాకుండా, నకిలీ పాలపొడిని ఉపయోగించి తయారుచేస్తున్నారు.

రాజస్థాన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న పాలపొడిని తెప్పించుకుని, దానిలో కెమికల్స్ కలిపి ఈ స్వీట్లు తయారుచేస్తున్నారు. దుర్వాసన కలిగే అపరిశుభ్రమైన ప్రదేశంలో ఈ స్వీట్లు తయారు చేస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన భోళా శంకర్ అనే వ్యక్తి ఈ తయారీని కొనసాగిస్తున్నాడు. ఈసమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు ఈ దాడులు చేశారు. సుమారు లక్ష రూపాయల సామాగ్రిని స్వాధీనం చేసుకుని, భోళా శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏదైనా బయట అమ్మే తినుబండారాలు కొనాలంటే బయపడాల్సిన రోజులొస్తున్నాయి. ఇంట్లో చేసుకోవడమో, లేదంటే ఏదైనా మంచి  బ్రాండ్స్‌కు సంబంధించిన పదార్థాలు కొనుగోలు చేయడమో ఉత్తమం.