Home Page SliderTelangana

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఈటల మంత్రాంగం

Share with

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు వచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ఎన్నికల సన్నద్ధతపై ఒక అవగాహనకు రానున్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత ఎన్నికల నిర్వహణ తేదీపై క్లారిటీ రానుంది. ఇవాళ రేపు ఎల్లుండి తెలంగాణలో ఎన్నికల సంఘం అధికారుల పర్యటనపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంటే.. అదే సమయంలో ఎన్నికల్లో విజయం సాధించాలని మూడు పార్టీలు తహతహలాడుతున్నాయ్. ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటూ… ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణలో తొలిసారి విజయాన్ని సాధించాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం పూర్తి చేసిన పెద్దలు ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కీలకంగా అడుగులు వేస్తున్నారు.

పైకి ఆ పార్టీ, ఈ పార్టీ అన్న లెక్కలు వేసుకుంటున్నప్పటికీ… బీజేపీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని భావిస్తున్న నాయకగణం… ప్రజలను అందుకు తగిన విధంగా సమాయత్తం చేసుకునేందుకు రెడీ అవుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఊపు వచ్చిందని చెబుతున్నా… టికెట్ల కేటాయింపు సమయంలో బీజేపీలో చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయన్న భావన ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల వ్యవధిలో తెలంగాణకు రెండు సార్లు రావడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. పార్టీని ముందుకు నడిపించేందుకు కాషాయపెద్దలు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో పసుపు బోర్డు ప్రకటించడం, గిరిజన యూనివర్సిటీ ప్రకటించడం ద్వారా కమలం పార్టీలో వెలుగులు విరబూస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే పార్టీని సన్నద్ధం చేసిన తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ రాజేందర్, కేంద్ర పెద్దల ఆదేశాలతో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపిక సంబంధించి కసరత్తు పూర్తయ్యింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్ర నేతలు ఇప్పటికే కుండబద్ధలుకొట్టారు. ఎన్నికల్లో విజయం సాధించి తీరాలన్న కసిగా ఉన్న అనేక మంది నాయకులకు, ఎన్నికల్లో ఎలా కొట్లాడాలి.. ఎలా ప్రత్యర్థులను ఓడించాలన్నదానిపై ఈటల రాజేందర్ వేర్వేరుగా ఎలక్షన్ ప్లాన్ అందిస్తున్నారు. అభ్యర్థులు బలాలు, బలహీనతలు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్ర నివేదికలను ఆయా అభ్యర్థులకు అందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఊపు తీసుకొచ్చేందుకు పార్టీ హైకమాండ్ శతవిధాలుగా పనిచేస్తుంటే.. స్థానికంగా పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అడుగులు వేస్తున్నారు. తెలంగాణలోని కీలక జిల్లాల్లో ముక్కోణపు పోటీ తప్పదన్న భావన నెలకొంది.

బీజేపీ బలంగా ఉన్న స్థానాలు, గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థానాలేంటన్నదానిపై అవగాహనకు వచ్చిన కాషాయం పెద్దలు, స్థానికంగా వ్యూహాలను అమలు చేసే బాధ్యతను బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కు అప్పగించినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మూడు జిల్లాలల్లోని 31 స్థానాలతోపాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాతిక సీట్లపై ఎక్కువగా పార్టీ దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, పార్టీ అగ్రనేత ఈటల రాజేందర్ ఏఏ నియోజకవర్గంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న అభ్యర్థులను ఈ ఎన్నికల్లో పుష్ చేస్తే పార్టీ విజయం ఖాయమని వారు భావిస్తున్నారు.

సర్వే అంచనాలను దగ్గర పెట్టుకొని అభ్యర్థులను ఖరారు చేసి, వచ్చే రెండు నెలల పాటు పూర్తి స్థాయిలో కార్యక్షేత్రంలో ఉండాలని నిర్ణయానికి వచ్చారు. ఓవైపు కిషన్ రెడ్డి మరోవైపు ఈటల రాజేందర్ గెలిచే సీట్లలో పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించాలని.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన స్థానాల్లో గెలిచి తీరాలని భావిస్తున్నారు. అభ్యర్థుల బలాలు, బలహీనతలపై మరోసారి కేంద్ర పెద్దలకు పవర్ పాయింట్ చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేత, బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ లో నెలకొన్న గత్తర, బీజేపీకి లబ్ధి కలిగిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఐతే బీజేపీ ఐడియాలజీకి అనుగుణంగా ఉండే పలువురిని వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలపాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఈటల రాజేందర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు.