Home Page SliderTelangana

మల్కా‌జ్‌గిరి ప్రచారపర్వం ప్రారంభించనున్న ఈటల రాజేందర్

Share with

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఫుల్ క్లారిటీతో ఉన్న బీజేపీ ఏ ఒక్క సీటును తేలిగ్గా వదులుకోరాదని భావిస్తోంది. తెలంగాణలో 10 సీట్లను ఖాయంగా గెలుచుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ ఇప్పటికే 8 సీట్లు పక్కాగా గెలుస్తాన్న విశ్వాసంతో ఉంది. మరో రెండు సీట్లలో విజయం కోసం నాలు సీట్లను లక్ష్యంగా పెట్టుకొని కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇక దేశంలోని అతి పెద్ద లోక్ సభ నియోజకవర్గం మల్కాజ్‌గిరిలో బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్ బరిలో నిలవబోతున్నారు.

ఆసియాలోనే అతి పెద్ద ఓటరు జనాభా ఉన్న నియోజకవర్గంగా మల్కాజ్‌గిరి చరిత్ర పుటల్లో నిలిచింది. మల్కాజ్‌గిరి నుంచి గెలిచేవారు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి సీటుకు బీజేపీలో డిమాండ్ రోజు రోజుకు పెరిగింది. అయితే గెలుపు మాత్రమే ప్రాతిపదికగా భావించిన బీజేపీ హైకమాండ్.. ఇక్కడ్నుంచి బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను రేసులో నిలపాలని నిర్ణయించింది. మల్కాజ్‌గిరిలో రాజేందర్ పోటీ దాదాపు కన్ఫర్మ్ అయింది. వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరిలో తిరుగులేని విజయం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓవైపు హైకమాండ్ ఆదేశాలు రావడం ఆలస్యం తరువాయి, అన్నట్లుగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఈటల రాజేందర్ కసరత్తు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను బీజేపీ అభ్యర్థులు గణనీయంగా ఓట్లు సాధించారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలకు తీసిపోని విధంగా ఓటు షేర్ సాధించారు. కూకట్‌పల్లి మినహా ఆరు చోట్ల బీజేపీ అభ్యర్థులే బరిలో దిగారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వాతావరణం ఒకలా, లోక్ సభ ఎన్నికల్లో సినారియో మరోలా ఉంటుందన్నది తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరపతి తగ్గుతుందని భావిస్తున్న బిజెపి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను గంపగుత్తగా బిజెపికి వచ్చేలా ప్లాన్ చేయాలని భావిస్తోంది. అందుకు క్రౌడ్ పుల్లర్‌గా అటు కార్యకర్తలు, ఇటు పార్టీ నేతల అభిమానం పొందిన ఈటల రాజేందర్‌ను మల్కాజ్‌గిరి బరిలో దింపాలని నిర్ణయించింది. పార్టీ ప్రకటన వెలువడి నాటి నుంచి మల్కాజ్‌గిరిలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారభేరి మోగించాలని ఈటల భావిస్తున్నారు. ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న విశ్వాసం ఈ ఎన్నికలల్లో తనకు శ్రీరామరక్షగా నిలుస్తోందని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో ప్రజల్లోకి చొచ్చుకువెళ్లే గుణం.. తనకు ఈ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించేలా చేస్తోందని ఆయన యోచిస్తున్నారు. అందుకే ఇప్పటికే నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో వివిధ కార్యక్రమాల్లో ఈటల పాల్గొంటూ వచ్చారు. ఈ ఎన్నికల్లో అవి కూడా పార్టీకి కలిసి వస్తాయని నేతలు అంచనా వేసుకుంటున్నారు.

ఈ ఎన్నికల్లో తెలంగాణలో 10 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే నలుగురు సిట్టింగ్ ఎంపీలకు దాదాపు సీట్లను కన్ఫామ్ అని చెబుతున్న పార్టీ వర్గాలు… గెలిచే సీట్లపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సీట్లను కచ్చితంగా విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న మహబూబ్‌నగర్, మెదక్ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషణల్లో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తంగా వచ్చే లోకసభ ఎన్నికల్లో 4+4తో పార్టీ ఖాతా ప్రారంభమవుతుందని బీజేపీ నేతలు దీమాతో ఉన్నారు.