Home Page SliderNational

‘లోక్‌సభను జరగనివ్వరా’… స్పీకర్ మండిపాటు-మొత్తం 141 మంది ఎంపీల  సస్పెన్షన్లు

Share with

లోక్‌సభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. స్మోక్ బాంబు ఘటనలో మరోమారు లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనితో లోక్‌సభా సమావేశాలు జరగనివ్వరా అంటూ స్పీకర్ మండిపడ్డారు.  ఇప్పటికే విడతలు,విడతలుగా 92 మందిని సస్పెండ్ చేసిన స్పీకర్ ఓం బిర్లా మంగళవారం సభ ప్రారంభం కాగానే జరుగుతున్న ఆందోళనతో మరో 49 మందిని సస్పెండ్ చేశారు. దీనితో మొత్తం ఈ శీతాకాల సమావేశాలలో సస్పెన్షన్‌కు గురైన ఎంపీల సంఖ్య 141కి చేరింది. సభలోపలికి ప్లకార్డులు తీసుకువచ్చి, స్పీకర్ పోడియంలోకి దూసుకువస్తున్నారని, సభామర్యాద పాటించడం లేదని స్పీకర్ ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను లేకుండా చేయాలని ఆలోచిస్తోందని, అందుకే విపక్షాలను సస్పెండ్ చేస్తున్నారని విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీనితో విపక్ష సభ్యులు గుమ్మం వద్ద బైఠాయించి నిరసనలు తెలియజేస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ వీరి ప్రవర్తనల వల్లే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారని, ఇలాగే ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికలలో కూడా గెలవరని ఎద్దేవా చేశారు.