Andhra PradeshHome Page Slider

ఏప్రిల్ ఒకటి నుంచి తిరుమల నడక మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు

Share with

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు నడకమార్గం ద్వారా చేరుకునే భక్తుల కోరిక మేరకు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా వారం రోజులపాటు అలిపిరి మార్గంలో పదివేలు, శ్రీవారి మెట్టు మార్గంలో ఐదువేల దివ్య దర్శనం టోకెన్లను మంజూరు చేస్తామని ఆ తర్వాత భక్తుల సూచనలను పరిగణలోకి తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటామని టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఈవో ధర్మారెడ్డి తో కలిసి చైర్మన్ విలేకరుల సమావేశం నిర్వహించారు.

భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏప్రిల్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కావున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోట, వర్చువల్ సేవలు, 300 దర్శనం టికెట్లు తగ్గించామని తెలిపారు. అలాగే మూడు నెలల పాటు వీఐపీలు సిఫార్సు లేఖలు తగ్గించాలని ఈ సందర్భంగా ఆయన వీఐపీలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి.

తద్వారా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుందన్నారు టీటీడీ ఛైర్మన్. ఇక ఆలయ మాడ వీధుల్లో భక్తుల రద్దీ ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్ పెయింటింగ్ వేయిస్తున్నామన్నారు. అదేవిధంగా తిరుమలలో 7500 పైగా గదులు ఉన్నాయని వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉందని దాదాపు 85% గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నామని తెలిపారు.