Home Page SliderTelangana

 ధూల్‌పేట పతంగులు- భలేమజాలే

Share with

జనవరి వచ్చిందంటే కొత్తసంవత్సరం మాత్రమే కాదు. ఆంధ్రుల పెద్దపండుగ సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. భారతీయ పండుగలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఇక్కడ కేవలం దేవతల పండుగలే కాదు. ప్రకృతిని పూజించే పండుగలు కూడా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ కొత్త సంవత్సరమైతే, ప్రకృతి ఆరాధనకు పేరెన్నికగన్నది సంక్రాంతి. పండిన పంట ఇంటికొచ్చే వేళ రైతు కుటుంబాలు సంతోషంతో జరుపుకునే పండుగ ఇది. ముచ్చటగా మూడురోజులపాటు జరిగే ఈ పండుగ చిన్నా,పెద్దా అందరూ కలిసి సరదాగా జరుపుకుంటారు.     

సంక్రాంతి అంటే మనకు  గొబ్బెమ్మలు,ముగ్గులు, హరిదాసులు, బసవన్నలు, కోడిపందాలు గుర్తొస్తాయి. కానీ సంక్రాంతికి మరో విశేషం గాలిపటాలు. హైదరాబాద్‌లోని ధూల్‌పేట గాలిపటాల తయారీకి ఎంతో ప్రసిద్ధి చెందింది. దాదాపు 100 సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా పతంగుల తయారీకి ధూల్‌పేట అడ్డాగా మారింది. హైదరాబాద్ వాసులు మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎంతోమంది వచ్చి ఇక్కడ పతంగులు ఖరీదు చేస్తారు. గుజరాత్, రాజస్తాన్ మొదలైన రాష్ట్రాల నుండి కూడా వ్యాపారులు భారీఎత్తున ఇక్కడి నుండి గాలిపటాలు కొనుగోలు చేసి, తీసుకువెళ్తుంటారు. విభిన్న రకాల గాలిపటాలు మంచి నాణ్యతతో తయారుచేసి, వినియోగదారుల మన్ననలు పొందుతున్నారు. తమకు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఆర్డర్స్ వస్తాయని దుకాణదారులు చెప్తుంటారు. ఈ గాలిపటాల తయారీని కుటీర పరిశ్రమగా గుర్తించాలని వారు కోరుకుంటున్నారు.

తెలంగాణా వివిధ జిల్లాల నుండి వచ్చి కొనుగోలు చేస్తారని వ్యాపారులు చెప్తున్నారు. వారు మెషీన్లు వాడకుండా పూర్తిగా చేతితో తయారుచేస్తారని, వంశపారంపర్యంగా దాదాపు 1000 కుటుంబాలు ఈ పనిపైనే ఆధారపడ్డారని చెప్తున్నారు. ఒకప్పుడు ధూల్‌పేట అంటే గంజాయి తయారీకి పేరు. ప్రజాప్రతినిధులు, పోలీసులు ఎంతో శ్రమపడి వారిని ఇతరవృత్తులకు మళ్లింపజేశారు. దీనితో వినాయకచవితికి వినాయక విగ్రహాలు, దుర్గా నవరాత్రులకు అమ్మవారి విగ్రహాలు కూడా ధూల్‌పేటలో తయారు చేస్తున్నారు అక్కడివారు. గాలిపటాలే కాకుండా ఇక్కడ తయారయ్యే మాంజాలు కూడా చాలా విశిష్టమైనవి. పక్షుల గొంతు కోసే చైనా మాంజాలను ప్రభుత్వం నిషేధించడంతో వీరు మైదాపిండి,దారం ఉపయోగించి, బలంగా తయారుచేసే మాంజాలకు బాగా డిమాండ్ ఏర్పడింది.