News AlertTelangana

సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్‌..!

Share with

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతుంటే.. సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఆహర కల్తీ కేసుల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉందని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్బి) షాకింగ్ నివేదిక విడుదల చేసింది. 2019లో రాష్ట్రంలో 1.18 లక్షల కేసులు నమోదు కాగా.. 2021లో 1.46 లక్షల కేసులు నమోదయ్యాయి.


రాష్ట్రంలో నేరాలపై ఎన్‌సీఆర్‌బీ షాకింగ్ రిపోర్ట్

ఎన్‌సీఆర్‌బీ క్రైమ్ ఇన్ ఇండియా-2020 వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో 2019లో 1,18,338 కేసులు నమోదు కాగా.. 2020లో 1,35,885 కేసులు నమోదయ్యాయి. 2021లో ఏకంగా 1,46,131 కేసులు నమోదు కావడం గమనార్హం. ఆర్థిక మోసాలకు సంబంధించిన సైబర్ నేరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. లైంగిక అక్రమ రవాణాలోనూ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక కేసుల్లో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. వృద్ధులపై జరిగే దాడుల్లో మూడో స్థానంలో, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇదీ రాష్ట్ర పరిస్థితి. ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా-2020 నివేదిక ప్రకారం తెలంగాణాలో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నాయి. 2019లో రాష్ట్రంలో 2691 కేసులు, 2020లో 5024 కేసులు నమోదయ్యాయి. 2021లో సైబర్ నేరాలు రెండు రెట్లు పెరిగాయి. ఏడాది కాలంలో ఈ సంఖ్య 10,303కి చేరింది. దేశవ్యాప్తంగా 52,430 సైబర్ నేరాలు నమోదైతే సుమారుగా 20 శాతం తెలంగాణ రాష్ట్రం లోనే నమోదు కావడం గమనార్హం. రెండో స్థానంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు (2180), ఏటీఎం(443), ఓటీపీ మోసాలు(1377), , నకిలీ ఫ్రొఫైళ్లు(37) మార్ఫింగ్(18).. తదితర నేరాలు సైతం తెలంగాణాలోనే ఎక్కువగా నమోదయ్యాయి.


ఆర్థిక నేరాల్లోనూ రెండో స్థానం

ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. 2021లో రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు 20,579 నమోదయ్యాయి. రాజస్థాన్ 23,757 కేసులతో తొలి స్థానంలో ఉంది. ఫోర్జరీ, నమ్మకద్రోహం కేసుల్లోనూ రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఆహారం, ఔషధాల కల్తీ కేసుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. దేశం మొత్తం మీద ఈ తరహా 8320 కేసులు నమోదు కాగా.. ఏపీలో 6575 కేసులు, తెలంగాణలో 1326 కేసులు నమోదయ్యాయి.
మహిళలపై నేరాలు సైతం తెలంగాణలో పెరుగుతున్నాయి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. 2020తో పోలిస్తే 2021లో తెలంగాణలో యాక్సిడెంట్లు 10.8 శాతం పెరిగాయి. వృద్ధులపై దాడుల విషయంలో తెలంగాణ 1952 కేసులతో మూడో స్థానంలో నిలిచింది.