Home Page SliderTelangana

మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తున్నా.. పార్టీ ఆదేశాలే శిరోధార్యం: ఈటల రాజేందర్

Share with

మల్కాజ్‌గిరిలో పోటీపై బీజేపీ ముఖ్యనేత ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా యాదగిరిగుట్ట వచ్చిన ఈటల వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం వల్ల ప్రయోజనం లేదన్న ఈటల, బీజేపీకి ఓటేసి మోదిని బలపర్చితే దేశానికి మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీపై విసుగుతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారన్న ఈటల, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారని.. ఇది కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అవకాశం కల్పిస్తే మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తానన్నారు. తనకు మల్కాజ్‌గిరిలో పోటీ చేసే ఆలోచన ఉందన్న ఈటల పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ పేదింటి బిడ్డ కాబట్టే పేదల కష్టాలు అర్థం చేసుకున్నారన్న ఈటల, పేదింటి మహిళల కోసం పది లక్షల రూపాయల వరకూ వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారన్నారు. పేద మహిళల కోసం టాయిలెట్లు కట్టించారని, ఇప్పటి వరకూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 కోట్ల మంది పేదలకు సొంతింటి కల నెరవేర్చిందన్నారు. ఈసారి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా రెండు బెడ్రూముల ఇళ్లు మంజూరవుతాయన్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలన్నారు. మరోసారి భారత ఖ్యాతిని పెంచుకుందామని ఈటల పిలుపునిచ్చారు. .