Andhra PradeshHome Page Slider

సజ్జల సారథ్యంలో చంద్రబాబు లక్ష్యంగా జైల్లో కుట్ర

Share with

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యంలో భారీ కుట్ర జరుగుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కుటుంబసభ్యులే ఆహారంలో ఏదైనా కలుపుతారేమోన్న తప్పుడు ప్రచారం చేస్తూ.. ఆ వంకతో భారీ కుట్ర చేసి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు చేస్తారేమోననే భయాందోళన అందరిలో నెలకొందని తెలిపారు. రాజమండ్రిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతో సజ్జల, డిప్యూటీ సీఎం నారాయణస్వామి మతిభ్రమించి నోటికొచ్చినట్లు మాట్లాడే దౌర్భాగ్య స్థితికి చేరారని ధ్వజమెత్తారు. జైలు ఆవరణలోకి డ్రోన్ ఎలావచ్చింది? దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో ఎందుకు చెప్పలేకపోతున్నారని డీఐజీని ప్రశ్నించారు.

జగన్‌కు చంచల్‌గూడలో సకల సదుపాయాలు

రూ.వేల కోట్ల ఆర్థిక నేరాలకు సంబంధించి 35 సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి.. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని గోరంట్ల అన్నారు. జగన్ చంచల్‌గూడ జైల్లో ఉన్నప్పుడు షటిల్ కార్యాలయంగా మార్చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక, ఆటవిక విధానాల కట్టడికి కేంద్రం తక్షణమే వైకాపా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక, మైనింగ్ కుంభకోణాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగింది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.