Andhra Pradesh

ఉత్తరాంధ్ర నుండి కంపెనీలను వెళ్లగొట్టారు

Share with

ఉత్తరాంధ్ర నుండి కంపెనీలను వెళ్లగొట్టిన వైసీపీ నేతలకు ఇప్పుడు హఠాత్తుగా అక్కడి ప్రజలపై ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. విశాఖను కొల్లగొట్టి రాష్ట్రం అధోగతి పాలవడానికి జగన్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ‘సేవ్ ఉత్తరాంధ్ర” పేరుతో ప్రజలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు తెలుగుదేశం అండగా నిలబడాలన్నారు. ముందస్తు ఎన్నికలకు నేతలు సిద్ధంగా ఉండాలని, ఆయా నియోజక వర్గాలలో గెలవడానికి స్థానిక నేతలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ పాలన వల్ల నష్టపోని వర్గాలేమీ లేవని, వారి వ్యతిరేఖతనే మనపార్టీ బలంగా మార్చుకోవాలని సూచించారు. 3 రాజధానుల పేరుతో జగన్ సర్కారు మోసం చేస్తోందన్నారు. కోర్టు చెప్పినా వినకుండా  మొండిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి గట్టి ప్రయత్నాలు చేయాలని, తమ పనితీరు ద్వారానే తమను నిరూపించుకోవాలని సూచించారు. పార్టీ గెలుపు సాధించే విషయంలో అలసత్వం వద్దని, పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ వెరిఫికేషన్ వంటి అంశాలపై నివేదికలు తయారుచేయాలని, పనిలో స్పీడు పెంచాలని హెచ్చరించారు.