Home Page SliderNational

యూపీలో ఢిష్యుం ఢిష్యుం… బీజేపీ నేత భర్తను చితకబాదిన ఎస్పీ ఎమ్మెల్యే

Share with

పోలీస్ స్టేషన్‌ వద్దే పంచాయితీ
దుర్భాషలాడినందుకు బడితెపూజ

ఉత్తరప్రదేశ్‌లోని ఒక పోలీసు స్టేషన్‌లో బుధవారం బీజేపీ నాయకురాలి భర్తను దారుణంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేతో సహా, దాడి చేసిన వారిని ఆపేందుకు పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి రష్మీ సింగ్, భర్త దీపక్ సింగ్‌పై, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కన్పించింది. రాకేష్ ప్రతాప్ సింగ్, మద్దతుదారులను దీపక్ సింగ్‌ను తీవ్రంగా గాయపర్చారు.

అసలు విషయం ఏంటంటే… దీపక్ సింగ్ పోలీసు స్టేషన్‌ వద్ద, నిరసనలో కూర్చున్న సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్‌ను దుర్భాషలాడటం వల్లే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. సహనం కోల్పోయి తాను దాడికి దిగినట్టు ఎమ్మెల్యే చెప్పాడు. స్టేషన్ వద్ద ఎమ్మెల్యే అయిన, తనను బీజేపీ నేత భర్త తిడుతుంటే, పోలీసులు చోద్యం చూశారని విమర్శించాడు రాకేష్ ప్రతాప్ సింగ్.

అంతకు ముందు, ఇరువర్గాల మధ్య గొడవ జరిగిన తర్వాత, దీపక్ సింగ్ గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యుడు, మద్దతుదారులను దుర్భాషలాడడం బిగ్గరగా వినిపించింది. పరిస్థితి అకస్మాత్తుగా చేయి దాటిపోయిందని, ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ముఖాముఖికి వచ్చినప్పుడు పోలీసులకు స్పందించడానికి చాలా తక్కువ సమయం ఉందని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. సమస్య ఇప్పుడు పరిష్కరించబడిందని, ఇద్దరిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.