Home Page SliderTelangana

బిర్యానీలో బొద్దింక… హైదరాబాద్ రెస్టారెంట్‌కు దబిడి దిబిడే..!

Share with

టేక్‌అవే బాక్స్‌లోని భోజనంలో బొద్దింక
కష్టమర్ అభిప్రాయాలను అబద్ధమన్న రెస్టారెంట్
వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించిన బాధితుడు
బొద్దింక నిజమేనని ధ్రువీకరించిన ఫోరమ్
పరిహారంగా రూ. 20 వేల చెల్లించాలన్న కోర్టు

హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని కెప్టెన్ కుక్ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక కన్పించడంతో పరిహారంగా రూ.20,000 చెల్లించాలని కన్జ్యూమర్ ఫోరమ్ ఆదేశించింది. రెస్టారెంట్ మేనేజర్‌పై, వినియోగదారుడు అరుణ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏప్రిల్ 18న జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, పరిహారం చెల్లించాలని ఆదేశించింది. సెప్టెంబరు 2021లో, అరుణ్ అనే వ్యక్తి, కెప్టెన్ కుక్, రెస్టారెంట్ నుండి చికెన్ బిర్యానీ పార్శిల్‌ను ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత భోజనం చేసేందుకు కూర్చున్నాడు. అదే సమయంలో బిర్యానీపై బొద్దింక పాకడాన్ని చూశాడు. ఒక్కసారిగా ఈ సీన్‌తో తన రోజుల తరబడి ఆకలి తీరిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వెంటనే ఇదే విషయాన్ని వీడియో తీసి రెస్టారెంట్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. రెస్టారెంట్ మేనేజర్ నుండి క్షమాపణ అందుకున్నాడు. అయితే హోటల్ లో బొద్దింకలను తొలగించేందుకు కీటకాలున్న ఏరియాలో మందులు చల్లామని చెప్పాడు. అందువల్లే బిర్యానీపై బొద్దింక కన్పించి ఉండొచ్చన్నాడు. అయితే, ఆ బొద్దింకను చూసిన అరుణ్ క్షమాపణలను అంగీకరించలేదు. అయితే పరిహారం కింద రెస్టారెంట్ మేనేజర్ చెల్లించిన మొత్తం రూ. 240 మొత్తాన్ని తిరిగి చెల్లించాడని చెప్పాడు. ఐతే మొత్తం వ్యవహారాన్ని అరుణ్ జిల్లా ఫోరమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ టేక్‌అవే బాక్స్‌లోని భోజనంపై బొద్దింక బతికి ఉండే అవకాశం లేదని హోటల్ వాదించింది. హోటల్లో తయారు చేసిన బిర్యానీ తాజాగా, వేడిగా ఉందని పేర్కొంది.

వివరాలు విన్న తర్వాత, ఫోరమ్ రెస్టారెంట్ యజమానులను దోషులుగా గుర్తించింది. రెస్టారెంట్ నిర్వాహకులు పరిశుభ్రత ప్రమాణాలను పాటించడంలో విఫలమయ్యారంది. బొద్దింక నిజంగానే బయటకు పాకినట్లు వీడియోల ద్వారా స్పష్టమవుతోందని కమిషన్ పేర్కొంది. రెస్టారెంట్, వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జిల్లా ఫోరమ్ పేర్కొంది. 45 రోజుల వ్యవధిలో జరిమానా చెల్లించాలని కమిషన్ దోషులను ఆదేశించడంతోపాటుగా, అరుణ్ ఖర్చుల కోసం రెస్టారెంట్‌పై అదనంగా పదివేల ఫైన్ విధించింది.