Home Page SliderNational

చంద్రయాన్-3 కౌంట్‌డౌన్

Share with

భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 యాత్రకు కౌంట్‌డౌన్ స్టార్టయ్యింది. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 2.35 నిముషాలకు నింగిలోకి దూసుకుపోతుంది చంద్రయాన్ 3. గతంలో ప్రయోగించిన చంద్రయాన్ 1, చంద్రయాన్ 2లు కూడా విజయవంతమయ్యాయి. అదేవిధంగా చంద్రయాన్ 3 కూడా విజయవంతమై మంచి ఫలితాలనందజేస్తుందని ఆశిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 2లో ప్రయోగించిన ఆర్భిటార్ బాగా పనిచేసి చంద్రుని కక్ష్యలో తిరుగుతుండగా, చంద్రుని ఉపరితలంపై శోధించే ఉద్దేశంతో పంపిన విక్రమ్ రోవర్ మాత్రం చంద్రుని ఉపరితలాన్ని తాకగానే క్రాష్ అయిపోయింది. దీనితో నిరుత్సాహానికి గురయ్యారు ఇస్రో శాస్త్రవేత్తలు.

చంద్రుని ఉపరితలంపై నీటి జాడలు కనిపెట్టిన భారత్, ఇప్పుడు చంద్రుని దక్షిణ ధృవంలో చంద్రయాన్‌-3 ని పంపి మరిన్ని పరిశోధనలు చేయనుంది. దీని బడ్జెట్ అంచనా 631 కోట్ల రూపాయలు. దీని బరువు 3,900 కిలోలు. ఇది ఆగస్టు 23 లేదా 24 నాటికి చంద్రుని చేరే అవకాశం ఉంది. ఈసారి ఆర్భిటార్ ప్రయోగించకుండా కేవలం విక్రమ్ రోవర్‌ను పంపుతున్నారు. చంద్రయాన్ 2 కోసం పంపిన ఆర్భిటార్ చంద్రుని కక్ష్యలో తిరుగతూనే ఉంది. దానినే ఈ రోవర్ కోసం ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో శాస్త్రవేత్తలు గురువారం తిరుపతి శ్రీవారి దేవాలయంలో, శ్రీకాళహస్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు దేశప్రజలంతా ఈ ప్రయోగం విజయవంతమై భారత ఖ్యాతిని, మువ్వన్నెల జెండాను చంద్రునిపై ఎగురవేయాలని కోరుకుంటున్నారు.