Andhra PradeshHome Page Slider

ఢిల్లీకి చంద్రబాబు.. మూడు రోజులు హస్తినలోనే మకాం

Share with

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మూడు రోజులపాటు హస్తినలోనే మకాం వేయనున్న చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్ లో జరిగే ఎన్టీఆర్ ప్రత్యేక నాణేం విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఏపీలో ఓట్ల తొలగింపు ఇతర అవకతవకలపై ఫిర్యాదు చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు అనుకూల ఓట్లు తొలగింపు పై చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు చంద్రబాబు వివరిస్తారు. అలాగే ఉరవకొండలో ఓట్ల తొలగింపు ఘటనలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే చర్యలు తీసుకున్న నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ, పర్చూరు ఇతర ప్రాంతాల్లో భారీగా ఓట్ల తొలగింపు అంశాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం పార్టీ అనుకూల ఓట్ల సమాచారాన్ని సేకరిస్తుందని ఫిర్యాదు చేయనున్నారు. మొత్తం మూడు రోజులు పాటు ఢిల్లీలో మకాం వేయనున్న చంద్రబాబు భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.